SHRI SAI DWARKAMAI SANTHAN

        శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై

          SHRI SAI DWARKAMAI SANSTHAN TRUST ®

                ఈ ద్వారకామాత గొప్ప దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి.

సాయి నామం

II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II |

VIJAYA DASAMI

SRI RAMA NAVAM

CHAVADI

GURU POURNAMI

శ్రీ సాయిబాబా పుణ్యతిధి (విజయదశమి)

   హిందువులలో నెవరైన మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు, మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము. ఏలన ప్రపంచ విషయములనుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో నతడు పరమును సహజముగాను, సులభముగాను పొందును. పరీక్షిన్మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి, వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవతపురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులో నున్నది. చనిపొవుటకు సిద్ధముగా నున్నవారికి గీతా, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని యవతారమగుటచే వారికట్టిది యవసరము లేదు. కాని, యితరులకు ఆదర్శముగా నుండుటకు ఈయలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగనే వారు వజే యను నాతని బిలిచి రామవిజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి. అతడు వారములో గ్రంథము నొకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా యాజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు చదివి దానిని మూడు దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11 దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11 దినములు గడచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి యలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధాములో మునిగి చివరి క్షణముకయి యెదురు చూచుచుండిరి.

     రెండుమూడుదినముల ముందునుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరవరకు బాబా చైతన్యముతో నుండి, అందరిని ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికిని తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబు దీక్షితు, శ్రీమాన్ బుట్టీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు (అక్టోబరు 15వ తారీఖు) హారతి పిమ్మట వారిని వారివారి బసలకుబోయి భోజనము చేయుమనెను. అయినను కొంతమంది లక్షీబాయి శిందే, భాగోజి శిందే, బాయాజి, లక్షణ్ బాలాషింపి, నానాసాహెబు నిమోన్కర్ యక్కడనే యుండిరి. దిగువ మెట్లమీద శ్యామా కూర్చొనియుండెను. లక్షీబాయి శిందేకు 9 రూపాయలను దానము చేసినపిమ్మట, బాబా తనకాస్థలము (మసీదు) బాగలేదనియు, అందుచేత తనను రాతితో కట్టిన బుట్టీ మేడలోనికి దీసికొని పోయిన నచట బాగుగా నుండుననియు చెప్పెను. ఈ తుదిపలుకు లాడుచు బాబా బాయాజీ శరీరముపై ఒరిగి ప్రాణములు విడిచెను. భాగోజీ దీనిని గనిపెట్టెను. దిగువ కూర్చొనియున్న నానాసాహెబు నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా! యని యరచెను. బాబా తన భౌతికశరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను. బాబా సమాధి చెందెనని సంగతి శిరిడి గ్రామములో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరు స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి యేడ్వసాగిరి. కొందరు బిగ్గరగా నేడ్చిరి. కొందరు వీథులలో నేడ్చుచుండిరి. కొందరు తెలివితప్పి పడిరి. అందరి కండ్లనుండి నీళ్ళు కాలువలవలె పారుచుండెను. అందరును విచారగ్రస్తు లయిరి.

     కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొన మొదలిడిరి. మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యెదనని బాబా తమ భక్తులతో చెప్పిరని యొకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక నెవ్వెరును సందేహింప నక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణు వీ కార్యమే యొనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీ కృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ యవతారమున శ్రీ కృష్ణుడు భూమిభారమును తగ్గించెను. ఈ యవతారము (సాయిబాబా) భక్తుల నుద్ధరించుటకై వచ్చినది. కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ లగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధ మీయొక్క జన్మతోడిదే కాదు, అది కడచిన డెబ్బెదిరెండు జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధములు కల్గించిన యా మహారాజు (సాయిబాబా) ఎచటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శ్రీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢవిశ్వాసము భక్తులకు గలదు.

     బాబా శరీరమునెట్లు సమాధి చేయవలెనను విషయము గొప్ప సమస్య యాయెను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధిచేసి దానిపై గోరి కట్టవలె ననిరి. ఖుషాల్ చంద్, అమీరుశక్కర్ కూడ ఈ యభిప్రాయమునే వెలుబుచ్చిరి. కాని రామచంద్ర పాటీలు అను గ్రామమునసబు గ్రామములోని వారందరికి నిశ్చితమైన దృఢకంఠస్వరముతో “మీ యాలోచన మా కసమ్మతము. బాబా శరీరము రాతి వాడాలో పెట్టవలసినదే” యనిరి. అందుచే గ్రామస్థులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి.

     బుధవార ముదయము గ్రామములోని జ్యోతిష్కుడును, శ్యామాకు మేనమామయునగు లక్ష్మణ్ మామాజోషికి బాబా స్వప్నములో గాన్పించి, చేయిపట్టి లాగి యిట్లనెను. “త్వరగా లెమ్ము, బాపుసాహెబు నేను మరణించితి ననుకొనుచున్నాడు. అందుచే నతడు రాడు. నీవు పూజ చేసి, కాకడహారతిని ఇమ్ము.” లక్ష్మణ మామా సనాతనాచారపరాయణుడయిన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణభక్తివిశ్వాసము లుండెను. ఈ దృశ్యమును చూడగనే పూజాద్రవ్యములు పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను, హారతి చేసి పోయెను. మిట్ట మధ్యాహ్నము బాపుసాహెబు జోగ్ పూజాద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను.

     బాబా తుదిపలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించిరి, మంగళవారము సాయంకాలము రాహాతానుండి సబ్ ఇన్ స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలములనుండి వచ్చిరి. అందరు దానిని ఆమోదించిరి. ఆమరుసటి యుదయము అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్ గాం నుండి మామలతుదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి. కనుక, మామలతుదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలె ననెను. వాడా నుపయోగించుటకు రెండు రెట్లుకంటె ఏక్కువవోట్లు వచ్చెను. అయినప్పటికి జిల్లాకలెక్టరుతో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకాసాహెబు దీక్షిత్ అహమద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణవల్ల రెండవ పార్టియొక్క మనస్సు మారెను. అందరు ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధిచేయుట కంగీకరించిరి. బుథవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసికొనిపొయిరి. మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యాదార్ధముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయ మయ్యెను. అది యొక పూజామందిర మాయెను. అనేకమంది భక్తులచ్చటకు బోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబు భాటే, ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసని బాబా, బాబాకు గొప్పభక్తుడు.

     ఈ సందర్భములో నొక విషయము గమనించవలెను. ప్రొఫెసరు నార్కే కథనము ప్రాకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టి నప్పటికి అది బిగిసిపోలేదు. అవయవములన్నియు సాగుచుండెను. వారి కఫినీ చింపకుండ సులభముగా దీయగలిగిరి.

శ్రీరామనవమి

షిరిడీలో జరుగు ఉత్సవము లన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. కావున సాయిలీల (1925 – పుట 197) పత్రికలో విపులముగ వర్ణింపబడిన శ్రీరామనవమి యుత్సవముల సంగ్రహ మిచట పేర్కొనబడుచున్నది.

కోపర్ గాం లో గోపాలరావుగుండ్ అనునతడు పోలీసు సర్కిలు ఇన్స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్పభక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికి సంతానము కలుగలేదు. శ్రీ సాయి యాశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను. దానికాతడు మిక్కిలి సంతసించి షిరిడీలో నుత్సవము చేసిన బాగుండునని 1897లో భావించెను. ఈ విషయమై తక్కిన భక్తులగు తాత్యాపాటీలు, దాదా కోతేపాటీలు, మాధవరావు దేశపాండేలతో సంప్రదించెను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా యాశీర్వాదమును, అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా యాశీర్వదించియుండుటచే రెండవపర్యాయము ప్రయత్నించగా వెంటనే యనుమతి వచ్చెను. సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి. దానిలో బాబావారికేదో యింకొక ఉద్దేశమున్నట్లు కనుపించుచున్నది. ఈ యుత్సవమును శ్రీ రామనవమితో కలుపుట, హిందువుల మహమ్మదీయుల మైత్రికొరకు కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి చూడగా బాబా యుద్దేశములు రెండును నెరవేరినవి.

ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చెనుగాని యితర కష్టములు గాన్పించెను. షిరిడీ చిన్న గ్రామమగుటచే నీటి యిబ్బంది యెక్కువగా నుండెను. గ్రామమంతటికి రెండు నూతులుండెడివి. ఒకటి యెండాకాలములో నెండిపోవుచుండును. రెండవదానిలోని నీళ్ళు ఉప్పనివి. ఈ ఉప్పునీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ళబావిగా మార్చెను. ఈ నీరు చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరమునుంచి మోటలద్వారా నీరు తెప్పించెను. అప్పటికి మాత్రమే పనికివచ్చునట్లు అంగళ్ళు వేసిరి. కుస్తీల కొరకేర్పాటు చేసిరి.

గోపాలరావుగుండున కొకస్నేహితుడు గలడు. వాని పేరు దాము అణ్ణా కాసార్. అతనిది అహమద్ నగరు. ఆతనికి కూడ ఇద్దరు భార్యలున్నప్పటికి సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్వాదముతో పుత్రసంతానము గలిగెను. ఉత్సవముకొరకు ఒక జండా తయారు చేయించెను. అట్లనే నానాసాహెబు నిమోన్కరును ప్రబోధించగా అతడు కూడ ఒక నగిషీజండా నిచ్చుటకు ఒప్పుకొనెను. ఈ రెండుజండాలు ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండుమూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికిని అవలంబించుచున్నారు. బాబా యుండు మసీదుకు ద్వారకామాయి యని పేరు.

చందన ఉత్సవము

ఈ ఉత్సవములో నింకొక ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను. కొరాహ్లే గ్రామమందు అమీరు షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు. అతడు చందన ఉత్సవము ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్దనుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజాభజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవమూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను, గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి మూడు సంవత్సరములు ఈ యుత్సవము అమీరుషక్కరు జరిపెను. పిమ్మట అతని భార్య జరిపెను. ఒకేదినమందు పగలు హిందువులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి.

ఏర్పాట్లు

శ్రీరామనవమి బాబాభక్తులకు ముఖ్యమైనది; పవిత్రమైనది. భక్తులందరు వచ్చి ఈ యుత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నియు తాత్యాకోతే పాటీలు చూచుకొనెడివారు. ఇంటిలోపల చేయవలసినవన్నియు రాధాకృష్ణమాయి యను భక్తురాలు చూచుచుండెను. ఆమె యింటినిండ భక్తులు దిగేవారు. ఆమె వారికి కావలసినవన్నియు సమకూర్చుచుండెను. ఉత్సవమునకు కావలసినవన్నియు సిద్ధపరచుచుండెను. ఆమె స్వయముగా మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదుగోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసితో నిండియుండెడివి. వానిని చక్కగా కడిగి సున్నము పూయుచుండెను. ఒక్కొక్కప్పుడు మండుచున్న ధునికూడ తీసి బయట పెట్టుచుండెను. ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజుముందే చేయుచుండెను. బీదలకు అన్నదానమనగా బాబాకు చాలప్రీతి. అందుచే బీదలకు అన్నదానము ఈ యుత్సవముయందు విరివిగా చేయుచుండిరి. వంటలు విస్తారముగ, మిఠాయిదినుసులతో రాధాకృష్ణమాయి ఇంటిలో చేయుచుండిరి. ఇందులో అనేకమంది భక్తులు పూనుకొనుచుండెడివారు.

మేళా లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట

ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను. రాను రాను వృద్ధియగుచుండెను. 1912లో నొక మార్పుజరిగెను. “సాయి సగుణోపాసన”ను వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మయనువాడు దాదాసాహెబు ఖాపర్డే (అమరావతి నివాసి)తో నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బసచేసిరి. కృష్ణారావు వసారాలో చేరగిలి యుండగా కాకామహాజని పూజాపరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక క్రొత్తయాలోచన తట్టెను. వానిని పిలిచి యిట్లనెను. “ఈ యుత్సవమును శ్రీరామనవమినాడు చేయుటలో భగవదుద్దేశ మేదియో యుండవచ్చును. శ్రీరామనవమి యుత్సవమనగా హిందువులకు చాల ముఖ్యము. కనుక యీ దినమందు శ్రీరామనవమి యేల జరుపకూడ”దని యడిగెను. కాకామహాజని యీ యాలోచనకు సమ్మతించెను. బాబా యనుమతి దెచ్చుటకు నిశ్చయించిరి. ఒక కష్టము మాత్రము తీరనిదిగా గాన్పించెను. అది హరిదాసును సంపాదించుట. భగవన్మహిమలను కీర్తనచెయుటకు హరిదాసు నెచ్చటనుండి తేవలెననునది గొప్ప సమస్యగా నుండెను. తుదకది భీష్ముడే పరిష్కరించెను. ఎట్లన, అతని రామాఖ్యానమను శ్రీ రాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే నతడు దానిని కీర్తన చేయుటకు, కాకామహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి. చక్కెరతో కలిపిన శొంఠిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా యనుమతి బొందుటకై మసీదుకు పోయిరి. అన్నిసంగతులు మసీదునందుండియే గ్రహించుచున్న బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా యడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవుటచే బాబా యదేప్రశ్న భీష్ముడనడిగెను. అతడు శ్రీరామ నవమి యుత్సవము చేయ నిశ్చయించితి మనియు నందులకు బాబా యనుమతి నివ్వవలెననియు కోరెను. బాబా వెంటనే యాశీర్వదించెను. అందరు సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటిదినమున మసీదు నలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఊయల వ్రేలాడగట్టిరి. దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను. శ్రీరామజన్మోత్సవము ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. అప్పుడే లెండీ వనమునుండి మసీదుకు వచ్చిన బాబా, అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. అతడు కొంచెము జంకెను. జన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో యని అతడు సంశయించెను. అతడు బాబావద్దకు వెళ్ళిన తోడనే యిదినంతయు యేమని బాబా యడిగెను. ఆ ఊయల యెందుకు కట్టిరని యడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులోనుండు భగవంతుని నిర్గుణస్వరూపమగు ‘నింబారు’ (గూడు) నుండి యొక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి యింకొకటి భీష్మునకి పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. కొంతసేపటికి కథ ముగిసెను. ‘శ్రీ రామచంద్రమూర్తికీ జై’ యని ఎర్రగుండ బాజాభజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన బడునట్లు విరివిగా జల్లిరి. అందరు సంతోషములో మునిగిరి. అంతలో నొకగర్జన వినబడెను. చల్లుచుండిన గులాల్ యను ఎర్రపొడుము ఎటులనో బాబా కంటిలో పడెను. బాబాకోపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. జనులందరు ఇది చూచి భయపడి పారిపోయిరి. కాని బాబా భక్తులు, అవన్నియు తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా యాశీర్వాదములని గ్రహించి పోకుండిరి. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే యహంకారమును, దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబారూపములోనున్న రాముడు తప్పక కోపించవలెననిరి. షిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక యలవాటు. దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతనివద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నుత్సవము పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి యా మరుసటిదినము శ్రీకృష్ణజననమునాడు పాటించు ‘కాలాహండి’ యను నుత్సవము జరిపినపిమ్మట తీసివేయవచ్చునని చెప్పెను. కాలాహండి యనగా నల్లనికుండలో అటుకులు, పెరుగు, ఉప్పుకారముకలిపి వ్రేలాడ గట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులగు గొల్లపిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను. ఆ మరుసటిదినము ఇవన్నియు పూర్తియైనపిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవసమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండెను. అప్పటినుండి జాతర (మేళ) శ్రీరామనవమి యుత్సవముగా మారెను.

1913 నుంచి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు హెచ్చించిరి. చైత్రపాడ్యమినుంచి రాధాకృష్ణమాయి ‘నామసప్తాహము’ ప్రారంభించుచుండెను. భక్తులందరు అందు పాల్గొందురు. ఆమె కూడ వేకువజామున భజనలో చేరుచుండెను. దేశమంతట శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథాకాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5, 6 రోజులు ముందు మహాజని బాలబువ మాలీని (ఆధునిక తుకారామ్) కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కొనివచ్చెను. ఆ మరుసటి సంవత్సరము అనగా 1914లో సతారాజిల్లా బిర్హాడ్ సిద్ధకవఠె గ్రామములోని హరిదాసుడగు బాలబువ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచేత కథలు చెప్పక ఖాళీగానుండెను. బాబా యనుమతి కాకా ద్వారా పొంది అతడు షిరిడీ చేరెను. హరికథ చెప్పెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను 1914వ సంవత్సరములో శ్రీ సాయి పరిష్కరించెను. ఈపని శాశ్వతముగా దాసగణు మహారాజునకు అప్పగించెను. ఈనాటివరకు దాసగణు ఈ కార్యమును జరుపుచున్నారు.

1912 నుండి ఈ యుత్సవము రానురాను వృద్ధిపొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తుమ్మెదల పట్టువలె ప్రజలతో నిండుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీలలో ననేకమంది పాల్గొనుచుండిరి. బీదలకు అన్న సంతర్పణ బాగుగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శ్రీసాయిసంస్థాన మేర్పడెను. అలంకారములు; ఆడంబరము లెక్కువాయెను. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రథము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులుకూడ వచ్చెను. ఇవన్నియు హెచ్చినప్పటికి సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు. ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్యవిషయమేమన హిందువులు, మహమ్మదీయులు కలసిమెలసి యెట్టి కలహములు లేకుండ గడిపేవారు. మొదట 5,000 మొదలు 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. తుదకు 75,000 వరకు రాజొచ్చిరి. అంతమంది గుమిగూడినప్పిటికి ఎన్నడైనను వ్యాధులుకాని జగడములుగాని కనిపించలేదు.

మసీదు మరామతులు

గోపాలరావుగుండునకు ఇంకొక మంచియాలోచన తట్టెను. ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదుమరామతుచేయ నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈపని బాబా అతనికి నియమించలేదు. ఈ పని నానాసాహెబు చాందోర్కరుకు, రాళ్ళుతాపన కాకాసాహెబు దీక్షిత్ కు నియోగించెను. ఈ పనులు చేయించుట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహళ్సాపతి కల్గించుకొనుటవలన బాబా యనుమతి నిచ్చెను. బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళచే తాపనచేయుట ముగించిరి. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్నపరుపుమీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 వ సంపత్సరములో సభామండపము పూర్తిచేసిరి. మసీదుకు ముందున్న జాగా చాల చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బుపెట్టి యినుపస్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రియంతయు శ్రమపడి స్తంభములు నాటిరి. ఆ మరుసటిదినము ప్రాతఃకాలముననే బాబా చావడినుండి వచ్చి యది యంతయు జూచి కోపించి వానిని పీకి పారవైసెను.

ఆసమయమందు బాబా మిక్కిలి కోపోద్ధీపితుడయ్యెను. ఒకచేతితో ఇనుపస్తంభము బెకిలించుచు, రెండవచేతితో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పుకణములవలె వెలుగుచుండెను. ఎవరికిని బాబావైపు చూచుటకు ధైర్యము చాలకుండెను. అందరు భయకంపితులైరి. బాబా తన జేబులోనుంచి ఒక రూపాయి తీసి యటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను. తాత్యాకూడ చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమియు తెలియకుండెను. అందులో కల్పించుకొనుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. కుష్ఠురోగియు బాబా భక్తుడునగు భాగోజి శిందియా కొంచెము ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసెను. మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది జోలికి పోదలచిరో అందరికి యొకేగతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను, ఒక దుకాణదారుని పిలిపించెను. వానివద్దనుంచి జరీపాగాను క్రయమునకు దీసికొనెను, దానిని బాబా స్వయముగా తాత్యాతలకు చుట్టెను. తాత్యాను ప్రత్యేకముగా గౌరవించుటకు బాబా యిట్లు చేసియుండెను. బాబాయొక్క యీ వైఖరిని జూచినవా రెల్లరు నాశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబా కెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించెను? వారికొపము తత్ క్షణమే ఎట్లు చల్లబడెను? అని యందరు ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె గూర్చిండి యత్యంతానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కొపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. 

చావడి యుత్సవము

బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను, ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరగనే చావడి రెండు గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందువరకు ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో నిద్రించుచుండిరి. 1909 డిసంబరు 10 తేదీనుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలిడిరి. వారి కటాక్షముచే దీనినే యిప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు. భజనబృందము వెనుక రథము, కుడివైపు తులసీబృందావనమును, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతి గల పురుషులు, స్త్రీలు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిరితలు, మృదంగము, కంజిరా, మద్దెలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటురాయివలె సాయిబాబా భక్తులందరిని తమ వద్దకు ఈడ్చుకొనెడివారు. బయట బహిరంగస్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి నలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి ‘శ్రీసాయినాథ మహారాజ్ కీ జయ్’ యని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో నలంకరించుచుండిరి. మసీదు చుట్టు దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుఱ్ఱము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుమని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చొనెడివారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా యని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమయినది. బాబా శరీరముపై మామూలు కఫనీ వేసికొని, చంకలో సటకా పెట్టుకొని, చిలుమును-పొగాకును తీసికొని, పైన ఉత్తరీయము వేసుకొని, బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుచున్న దీపము నార్పి, చావడికి బయలుదేరెడి వారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి; మతాబా మందుసామాను లనేకరంగులు ప్రదర్శించుచు కాలెడివి. పురుషులు, స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణ సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత బట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు ‘శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జయ్’ అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడు వారు. వానిపై బాబా భక్తుల కేకలుతో నడచెడువారు. తాత్యాయెడమచేతిని మహాళ్సాపతి కుడిచేతిని, బాపుసాహెబుజోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనెడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను, పూర్తిగాను నలంకరించిన యెఱ్ఱ గుఱ్ఱము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యముల మ్రోగించువారు, భక్తుల సమూహ ముండెడిది. హరినామస్మరణతోను, బాబా నామస్మరణతోను ఆకాశము బద్దలగునటుల మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగ శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొనువారందరు ఆనందించుచుండిరి.

ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖముపెట్టి నిలిచి యొక విచిత్రమయిన ప్రకాశముతో వెలిగెడివారు. వారి ముఖము ఉదయసంధ్య వలె లేదా బాలభానునివలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరమువైపు ముఖము బెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు. వారెవరినో పిలుచునటుల గనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి, యొక వెండిపళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని దీసికొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోను, సౌందర్యముతోడను, వెలుగుచుండెను. అందరు ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు, మాటలు చాలవు, ఒక్కొక్కప్పు డానందమును భరించలేక మహళ్సాపతి దేవత యావేశించిన వానివలె నృత్యము చేయువాడు. కాని, బాబాయొక్క ధ్యాన మేమాత్రము చెదరక యుండెడిది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమప్రక్క నడచుచుండెను. భక్త మహాళ్సాపతి కుడివయిపు నడచుచు బాబా సెల్లాయంచును పట్టుకొనెడివాడు. ఆ యుత్సవమెంతో రమణీయముగ నుండెడిది. వారి భక్తి చెప్పనలవికానిది. ఈ పల్లకి యుత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడచుచుండెను. ప్రేమభక్తులతో భక్తమండలి బాబా కిరుప్రక్కలనడుచు చుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై యుండగ శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడచిపోయినవి. ప్రస్తుతము గాని, యికముందు గాని యా దృశ్యమును గనలేము. ఐనను ఆ దృశ్యమును జ్ఞప్తికి దెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును.

చావడి బాగుగా నలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోను, నిలువుటద్దములతోను అనేకరంగుల దీపములతోను వ్రేలాడ గట్టిన గాజుబుడ్డీలతోను అలంకరించుచుండిరి. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి యొక యాసనము వేసి, బాలీసును ఉంచి, బాబాను కూర్చుండబెట్టి మంచి యంగరఖా తొడిగించినపిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి, పువ్వుల మాలలు వేసి, మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును, మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరముగా జూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసరివైచునని వారికి భయము, బాబా వారి యంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కాదు. ఈ యలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా గనుపించుచుండిరి.

నానాసాహెబు నిమోన్ కర్ గిఱ్ఱున తిరుగు కుచ్చుల ఛత్రములు పట్టుకొనుచుండెను. బాపూసాహెబు జోగ్ యొక వెండి పళ్ళెములో బాబా పాదముల కడిగి, యర్ఘ్యపాద్యము లర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలము నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొనియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని యుండగా భక్తులు ఇరువైపుల చామరములతోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. అప్పుడు శ్యామా చిలుమును తయారుచేసి, తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పుపీల్చి బాబా కిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహాళ్సాకు ఇచ్చెడువారు. తదుపరి యితరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది యనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకొన్నది. ఆ యుత్సవము పూర్తి యయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వులగుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యముల కవతారమగుటచేత ఆ యలంకరణములను గాని మరియాదలను గాని లెక్క పెట్టువారుకారు. భక్తలందుగల యనురాగముచే, వారి సంతుష్టికొరకు వారి యిష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతి నిచ్చువాడు. హారతి సమయమున బాజాభజంత్రీ మేళతాళములు స్పేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి యొకరి తరువాత నొకరు తమతమ యిండ్లకు బోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా యింటికి పోవుటకు లేవగా, బాబా ప్రేమతో నాతనితో నిట్లనెను. “నన్ను కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్ళుము గాని రాత్రి యొకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము.” అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే యమర్చుకొనువారు. 50, 60 దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు.

మనము కూడ ఇప్పుడు విశ్రమించెదము. ఈ యధ్యాయమును ముగించకముందు భక్తుల కొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను, వారి చావడి యుత్సవమును జ్ఞప్తికి దెచ్చుకొనవలెను.

గురుపూర్ణిమ

శ్రీ సాయిబాబా వారు పూజ చేసుకోవడానికి ఎవరినీ అనుమతించేవారు కాదు. భక్తులెవరైనా పూలమాల వేయబోయినా నిరాకరించేవారు. 1908వ సంవత్సరం గురుపూర్ణిమ రోజున మొట్టమొదట శ్రీ సాయిబాబా వారికి పూజ నిర్వహించే భాగ్యం తాత్యాసాహెబ్ నూల్కర్‌కు దక్కింది.

ఒకరోజు ఉదయం నూల్కర్ మసీదుకు వెళ్ళి సాయిబాబా వారికి నమస్కరించగానే, సాయిబాబా వారు అతనికి మసీదులో ధుని ప్రక్కనున్న స్తంభాన్ని చూపుతూ, “రేపు ఆ స్తంభాన్ని పూజించు!” అన్నారు. సాయిబాబా వారు అలా ఎందుకన్నారో నూల్కర్‌కు బోధపడలేదు. బసకు తిరిగి వెళ్ళిన తరువాత సాయిబాబా వారు ఆదేశాన్ని శ్యామా కు చెప్పి, అలా ఆదేశించడంలో సాయిబాబా వారి ఉద్దేశ్యం ఏమైవుంటుందని అడిగాడు. శ్యామా కు కూడా అర్థం కాలేదు. అతను వెంటనే సాయిబాబా వారినే అడుగుదామని మసీదుకెళ్ళాడు. సాయిబాబా వారు అతనితో కూడా అదే మాట చెప్పారు. ఆ తర్వాత తాత్యాకోతేపాటిల్ తోనూ, దాదాకేల్కర్ తోనూ సాయిబాబా వారు అవే మాటలన్నారు. మరుసటిరోజు శనివారం ఉదయం నిద్ర మేల్కొన్న నూల్కర్‌కు ఆరోజు గురుపౌర్ణమి అని హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని అతడు శ్యామా  తదితర భక్తులకు చెప్పాడు. అందరూ పంచాంగం కేలండర్ తెప్పించి చూచారు. నిజమే! ఆరోజు గురుపౌర్ణమి! ఆ ముందురోజు సాయిబాబా వారు తమతో ‘రేపు ఆ సంభాన్ని పూజించ’మని ఆదేశించడంలోని పరమార్థం వారికప్పుడు బోధపడింది. అందరికీ ఎంతో ఆనందమయింది.

వెంటనే అందరూ మసీదుకు వెళ్లి, ‘గురుపూజ’ చేసుకోవడానికి అనుమతించాలని సాయిబాబాను వేడుకొన్నారు. బాబా ముందురోజు చెప్పినట్లుగానే మసీదులోని స్తంభానికి పూజచేసుకొమ్మన్నారు. “దేవా! ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మేము మీకే పూజ చేసుకుంటాము. సాక్షాత్తు దైవమే మా ఎదురుగా వుంటే, స్తంభాన్ని పూజించవలసిన పనేముంది?” అని శ్యామా  వాదించాడు. తమను పూజించేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. భక్తులు తమ పట్టు విడువలేదు. చివరకు, భక్తిభావంతో వారు కోరే విన్నపాన్ని మన్నించక తప్పలేదు బాబాకు. “సరే, మీ ఇష్టం!” అన్నారు. భక్తుల ఆనందానికిక పట్టపగ్గాలు లేవు. వెంటనే గురుపూజకు సన్నాహాలు మొదలుపెట్టారు. బాబా భిక్షకు వెళ్ళివచ్చిన తర్వాత పూజ నిర్వహించాలని తలచి బాబాకు ఆ విషయం తెలిపారు. బాబా దయతో అంగీకరించడమే కాకుండా వారికి అన్ని ఉపచారాలు (పూజావిధులు) చేయడానికి కూడా అనుమతించారు. బాబా రాధాకృష్ణఆయీకి, దాదాకేల్కర్‌కు కబురు పంపారు. రాధాకృష్ణఆయీ పూజాద్రవ్యాలు పంపింది. దాదాకేల్కర్ పూజా వస్తువులతో మశీదు చేరాడు. సామూహికంగా పూజ నిర్వహించబడింది. తమకు సమర్పించిన దక్షిణలన్నీ బాబా తిరిగి భక్తులకే ఇచ్చివేశారు. పూజ అయిన తర్వాత ఆరతిచ్చారు. అలా ఆ సంవత్సరంనుంచి ప్రతి ఏటా శిరిడీలో గురుపూర్ణిమ ఎంతో వైభవంగా జరగటం ప్రారంభమయింది.

dwarkami
Scroll to Top
Scroll to Top