శ్రీ సాయిబాబా వారు శిరిడికి రెండవ సారి వచ్చిన దృశ్యం
ఔరంగాబాద్
జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయు డొకండుండెను. అతని పేరు
చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుఱ్ఱము తప్పిపోయెను. రెండుమాసములు
శోధించినను దాని యంతు దొరకకుండెను. అతడు నిరాశచెంది భుజముపై జీను వేసుకొని
ఔరంగాబాదునుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. 9 మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడిచెట్టు వద్దకు
వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపి, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు
ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును జూచి, అతనిని
బిలిచి చిలుము త్రాగి కొంతతడవు విశ్రాంతిగొనుమనెను. జీనుగురించి ప్రశ్నించెను. అది
తాను పోగొట్టుకొనిన గుఱ్ఱముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. దగ్గరగా నున్న
కాలువలో వెదకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుఱ్ఱమును చూచి
మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణమనుజుడు కాడనియు గొప్ప ఔలియా
(యోగిపుంగవుడు) అయివుండవచ్చుననియు అనుకొనెను. గుఱ్ఱమును దీసికొని ఫకీరువద్దకు
వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కాని నీరు, నిప్పు కావలసి
యుండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు
కావలసియుండెను. ఫకీరు ఇనుపచువ్వను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. సటకాతో
నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పి నా నీటితో తడిపి, నిప్పుతో
చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధముగా నుండుటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి
చాంద్ పాటీలు కందించెను. ఇదంతయు జూచి చాంద్ పాటీలు ఆశ్చర్యమగ్నుడయ్యెను. ఫకీరును
తన గృహము నకు రమ్మనియు, అతిథిగా నుండుమనియు చాంద్ పాటీలు
వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి యచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు
గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి
కూతురుది షిరిడీ గ్రామము. అందుచే షిరిడీ పోవుటకు పాటీలు కావలసినవన్ని జాగ్రత్త
చెసికొని ప్రయాణమునకు సిద్ధపడెను. పెండ్లి వారితో కూడ ఫకీరు బయలుదేరెను. ఎట్టి
చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లి వారు ధూప్ గ్రామము తిరిగి వచ్చిరి గాని
ఫకీరు షిరిడీలో ఆగి యచ్చటనే స్ధిరముగా నిలిచెను.