GURUSTHAN
గురుస్థానము
సాయిబాబా భక్తులకొరకు 16 ఏండ్ల బాలుడుగా షిరిడీలోని వేపచెట్టు క్రింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. స్వప్నావస్థయందయినను ప్రపంచవస్తువులను కాక్షించెడివారుకాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించు చుండెను. నానాచోవ్ దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. “ఈ చక్కని చురుకైన, అందమైనకుర్రవాడు వేపచెట్టుక్రింద ఆసనములోనుండెను. వేడిని, చలిని లెక్కింపక యంతటి చిన్నకుర్రవాడు కఠినతప మాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రియందెవరికి భయపడువాడు కాడు. చూచినవారశ్చర్యనిమగ్నులై యీ చిన్న కుఱ్ఱవా డెక్కడనుండి వచ్చినాడని యడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాల అందముగ నుండెను. ఒక్కసారి చూచినవారెల్లరు ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్న బాలునివలె గాన్పించినప్పటికిని చేతలనుబట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతనిగూర్చి యెవరికి నేమి తెలియకుండెను.” ఒకనాడు ఖండోబా దేవు డొకని నావేశించగా నీబాలు డెవడయి యుండునని ప్రశ్నించిరి. వాని తల్లి దండ్రు లెవరని యడిగిరి. ఎచ్చటి నుండి వచ్చినాడని యడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమునుచూపి గడ్ఢపారను దీసికొని వచ్చి యచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా నిటుకలు, వాని దిగువ వెడల్పు రాయి యొకటి గాన్పించెను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగా నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కఱ్ఱబల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుఱ్ఱవాని నీ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి యచ్చట గలదు గావున దానిని గాపాడవలెననియు చెప్పెను. వెంటనె దాని నెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ, ఉదుంబర, వృక్షములవలె నీ వేపచెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. షిరిడీలోని భక్తులు, మహాళ్సాపతి వంటి వారు ఈ వేప చెట్టును బాబా వారి యొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగనమస్కారములు చేసెదరు.
వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము
అక్కల్ కోటకర్ మహారాజుగారి భక్తుడు భాయి కృష్ణజీ అలి బాగ్ కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి ఫోటోను పూజించెడి వాడు. అతడొకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్ కోట గ్రామమునకు పోయి మహారాజుగారి పాదుకలు దర్శించి పూజించవలెనని యనుకొనెను. అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి యిట్లు చెప్పెను. “ప్రస్తుతము షిరిడీ నా నివాసస్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము.” అందుచే భాయి కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకొని షిరిడీ చేరి బాబాను పూజించి యచ్చటనే యారు మాసములు ఆనందముతోనుండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణమాసములో నొక శుభదినమున వేపచెట్టుక్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912వ సంవత్సరములో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీబాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్యపూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్తసగుణున కబ్బెను.
ఈ కథయొక్క పూర్తి వివరములు
ఠాణేవాసి బి.వి.దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతదారు. వేపచెట్టుక్రింద పాదుకల విషయము సంగతులన్నియు భక్తసగుణనుండి గోవిందకమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి, పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీసాయిలీల 11వ సంపుటిలో నీరీతిగా ప్రచురించిరి.
1912వ సంవత్సరము బొంబాయినుండి రామారావు కొఠారె యను డాక్టరొకడు షిరిడీ వచ్చెను. వాని మిత్రుడొకడు, వాని కాంపౌండర్ భాయికృష్ణజీ అలిబాగ్ కర్ అనునతడు వెంట వచ్చిరి. వారు భక్తసగుణుతోను జి. కె. దీక్షిత్ తోను స్నేహము చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనునపుడు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు చేసినదాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు భాయి కృష్ణజీ స్నేహితుడగు కాంపౌండర్ లేచి యా సంగతి డాక్టరు రామారావుకొఠారెకు దెలిపినచో చక్కని పాదుకలు చెక్కించెదరని నుడివెను. అందరు ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టరుగారికి ఈ విషయము తెలియపరచిరి. వారు వెంటనే షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి.
ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను జూపిరి. వారు కొన్ని మార్పులను జేసి, పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనమును దెలుపు యీ క్రింది శ్లోకమును కూడ చెక్కుమనిరి.
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతమ్|
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||
ఉపాసనీ సలహాల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండరు ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జి. కె. దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరమునుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా యా పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలని నుడివెను. చెట్టుక్రింద ప్రతిష్ఠింపుడని యాజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణమి ముందురోజు బొంబాయి పాస్తాసేట్ యను పార్సీ భక్తుడొకడు మనియార్డరు ద్వారా రూ. 25లు పంపెను. బాబా యీ పైకము పాదుకలను స్థాపించు ఖర్చునిమిత్త మిచ్చెను. మొత్తము రూ. 100లు ఖర్చు పెట్టిరి. అందులో రూ. 75లు చందాలవల్ల వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జి.కె.దీక్షిత్ యను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజచేసెను. తరువాత లక్షణ్ కచేశ్వర్ జఖాడె యను బ్రాహ్మణుడు (నానుమామా పూజారి) పూజ చేయుచుండెను. మొదటి 5 సం||ములు నెలకు రూ. 2లు చొప్పున డాక్టర్ కొఠారె దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకలచుట్టు కంచెకూడ పంపెను. ఈ కంచెయు, పై కప్పును కోపర్ గాం స్టేషనునుండి షిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు భక్తసగుణు ఇచ్చెను. ప్రస్తుతము జఖాడె పూజచేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును, దీపమును పెట్టుచున్నాడు.
మొట్టమొదట భాయికృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు.1912వ సం||ములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించునపుడు అక్కల్ కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీయందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామమునకు పోవలెననుకొని బాబావద్దకేగి యనుమతి నిమ్మనెను. బాబా యిట్లనెను. “అక్కల్ కోటలో నేమున్నది? అక్కడకేల పోయెదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతమిక్కడ నున్నారు. వారు నేనే.” ఇది విని భాయి కృష్ణజీ అక్కల్ కోటవెళ్లుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను.
తకియా (రచ్చ):
ప్రస్తుతము దీక్షిత్ వాడకు తూర్పు దిక్కున, వేపచెట్టు ఎదురుగా ఒక హాలు నిర్మింపబడినది. అంతకముందు ఇక్కడ తకియా (రచ్చ) వుండేది. శిరిడికి వచ్చె ఫకీర్లు ఇక్కడ విశ్రాంతి తీసుకొనేవారు. బాబా యీ మసీదుకు రాకపూర్వము ‘తకియా’ (రచ్చ) లో చాలాకాలము నివసించిరి. బాబాకి సంగీతము, నృత్యము అంటే చాలా ఇష్టం. శిరిడి వచ్చిన తోలి రోజులలో బాబా ‘తకియా’కి వెళ్ళి వివిధ బాషలలో(అరబిక్, పెర్షియన్, హింది.) భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు. 1890 వరకు బాబా కాలికి గజ్జలు కట్టి ఇక్కడ యితర ఫకీర్లతో కలిసి సొగసుగా నాట్యము చేయుచు పాటలు పాడేవారు. ఇప్పుడు తకియా అక్కడ లేదు, కానీ బాబా నాట్యం చేసి దృశ్యాన్ని గుర్తుచేసుకుంటే మనల్ని మనం మైమరిచిపోతాము.