గురుపౌర్ణమి
గురుపూర్ణిమ
శ్రీ సాయిబాబా వారు పూజ చేసుకోవడానికి ఎవరినీ అనుమతించేవారు కాదు. భక్తులెవరైనా పూలమాల వేయబోయినా నిరాకరించేవారు. 1908వ సంవత్సరం గురుపూర్ణిమ రోజున మొట్టమొదట శ్రీ సాయిబాబా వారికి పూజ నిర్వహించే భాగ్యం తాత్యాసాహెబ్ నూల్కర్‌కు దక్కింది.
ఒకరోజు ఉదయం నూల్కర్ మసీదుకు వెళ్ళి సాయిబాబా వారికి నమస్కరించగానే, సాయిబాబా వారు అతనికి మసీదులో ధుని ప్రక్కనున్న స్తంభాన్ని చూపుతూ, “రేపు ఆ స్తంభాన్ని పూజించు!” అన్నారు. సాయిబాబా వారు అలా ఎందుకన్నారో నూల్కర్‌కు బోధపడలేదు. బసకు తిరిగి వెళ్ళిన తరువాత సాయిబాబా వారు ఆదేశాన్ని శ్యామా కు చెప్పి, అలా ఆదేశించడంలో సాయిబాబా వారి ఉద్దేశ్యం ఏమైవుంటుందని అడిగాడు. శ్యామా కు కూడా అర్థం కాలేదు. అతను వెంటనే సాయిబాబా వారినే అడుగుదామని మసీదుకెళ్ళాడు. సాయిబాబా వారు అతనితో కూడా అదే మాట చెప్పారు. ఆ తర్వాత తాత్యాకోతేపాటిల్ తోనూ, దాదాకేల్కర్ తోనూ సాయిబాబా వారు అవే మాటలన్నారు. మరుసటిరోజు శనివారం ఉదయం నిద్ర మేల్కొన్న నూల్కర్‌కు ఆరోజు గురుపౌర్ణమి అని హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని అతడు శ్యామా తదితర భక్తులకు చెప్పాడు. అందరూ పంచాంగం కేలండర్ తెప్పించి చూచారు. నిజమే! ఆరోజు గురుపౌర్ణమి! ఆ ముందురోజు సాయిబాబా వారు తమతో ‘రేపు ఆ సంభాన్ని పూజించ’మని ఆదేశించడంలోని పరమార్థం వారికప్పుడు బోధపడింది. అందరికీ ఎంతో ఆనందమయింది.
వెంటనే అందరూ మసీదుకు వెళ్లి, ‘గురుపూజ’ చేసుకోవడానికి అనుమతించాలని సాయిబాబాను వేడుకొన్నారు. బాబా ముందురోజు చెప్పినట్లుగానే మసీదులోని స్తంభానికి పూజచేసుకొమ్మన్నారు. “దేవా! ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మేము మీకే పూజ చేసుకుంటాము. సాక్షాత్తు దైవమే మా ఎదురుగా వుంటే, స్తంభాన్ని పూజించవలసిన పనేముంది?” అని శ్యామా వాదించాడు. తమను పూజించేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. భక్తులు తమ పట్టు విడువలేదు. చివరకు, భక్తిభావంతో వారు కోరే విన్నపాన్ని మన్నించక తప్పలేదు బాబాకు. “సరే, మీ ఇష్టం!” అన్నారు. భక్తుల ఆనందానికిక పట్టపగ్గాలు లేవు. వెంటనే గురుపూజకు సన్నాహాలు మొదలుపెట్టారు. బాబా భిక్షకు వెళ్ళివచ్చిన తర్వాత పూజ నిర్వహించాలని తలచి బాబాకు ఆ విషయం తెలిపారు. బాబా దయతో అంగీకరించడమే కాకుండా వారికి అన్ని ఉపచారాలు (పూజావిధులు) చేయడానికి కూడా అనుమతించారు. బాబా రాధాకృష్ణఆయీకి, దాదాకేల్కర్‌కు కబురు పంపారు. రాధాకృష్ణఆయీ పూజాద్రవ్యాలు పంపింది. దాదాకేల్కర్ పూజా వస్తువులతో మశీదు చేరాడు. సామూహికంగా పూజ నిర్వహించబడింది. తమకు సమర్పించిన దక్షిణలన్నీ బాబా తిరిగి భక్తులకే ఇచ్చివేశారు. పూజ అయిన తర్వాత ఆరతిచ్చారు. అలా ఆ సంవత్సరంనుంచి ప్రతి ఏటా శిరిడీలో గురుపూర్ణిమ ఎంతో వైభవంగా జరగటం ప్రారంభమయింది.