శ్రీ రామనవమి
శ్రీరామనవమి
షిరిడీలో జరుగు ఉత్సవము లన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. కావున సాయిలీల (1925 – పుట 197) పత్రికలో విపులముగ వర్ణింపబడిన శ్రీరామనవమి యుత్సవముల సంగ్రహ మిచట పేర్కొనబడుచున్నది.
కోపర్ గాం లో గోపాలరావుగుండ్ అనునతడు పోలీసు సర్కిలు ఇన్స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్పభక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికి సంతానము కలుగలేదు. శ్రీ సాయి యాశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను. దానికాతడు మిక్కిలి సంతసించి షిరిడీలో నుత్సవము చేసిన బాగుండునని 1897లో భావించెను. ఈ విషయమై తక్కిన భక్తులగు తాత్యాపాటీలు, దాదా కోతేపాటీలు, మాధవరావు దేశపాండేలతో సంప్రదించెను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా యాశీర్వాదమును, అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా యాశీర్వదించియుండుటచే రెండవపర్యాయము ప్రయత్నించగా వెంటనే యనుమతి వచ్చెను. సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి. దానిలో బాబావారికేదో యింకొక ఉద్దేశమున్నట్లు కనుపించుచున్నది. ఈ యుత్సవమును శ్రీ రామనవమితో కలుపుట, హిందువుల మహమ్మదీయుల మైత్రికొరకు కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి చూడగా బాబా యుద్దేశములు రెండును నెరవేరినవి.
ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చెనుగాని యితర కష్టములు గాన్పించెను. షిరిడీ చిన్న గ్రామమగుటచే నీటి యిబ్బంది యెక్కువగా నుండెను. గ్రామమంతటికి రెండు నూతులుండెడివి. ఒకటి యెండాకాలములో నెండిపోవుచుండును. రెండవదానిలోని నీళ్ళు ఉప్పనివి. ఈ ఉప్పునీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ళబావిగా మార్చెను. ఈ నీరు చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరమునుంచి మోటలద్వారా నీరు తెప్పించెను. అప్పటికి మాత్రమే పనికివచ్చునట్లు అంగళ్ళు వేసిరి. కుస్తీల కొరకేర్పాటు చేసిరి.
గోపాలరావుగుండున కొకస్నేహితుడు గలడు. వాని పేరు దాము అణ్ణా కాసార్. అతనిది అహమద్ నగరు. ఆతనికి కూడ ఇద్దరు భార్యలున్నప్పటికి సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్వాదముతో పుత్రసంతానము గలిగెను. ఉత్సవముకొరకు ఒక జండా తయారు చేయించెను. అట్లనే నానాసాహెబు నిమోన్కరును ప్రబోధించగా అతడు కూడ ఒక నగిషీజండా నిచ్చుటకు ఒప్పుకొనెను. ఈ రెండుజండాలు ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండుమూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికిని అవలంబించుచున్నారు. బాబా యుండు మసీదుకు ద్వారకామాయి యని పేరు.
చందన ఉత్సవము
ఈ ఉత్సవములో నింకొక ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను. కొరాహ్లే గ్రామమందు అమీరు షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు. అతడు చందన ఉత్సవము ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్దనుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజాభజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవమూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను, గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి మూడు సంవత్సరములు ఈ యుత్సవము అమీరుషక్కరు జరిపెను. పిమ్మట అతని భార్య జరిపెను. ఒకేదినమందు పగలు హిందువులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి.
ఏర్పాట్లు
శ్రీరామనవమి బాబాభక్తులకు ముఖ్యమైనది; పవిత్రమైనది. భక్తులందరు వచ్చి ఈ యుత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నియు తాత్యాకోతే పాటీలు చూచుకొనెడివారు. ఇంటిలోపల చేయవలసినవన్నియు రాధాకృష్ణమాయి యను భక్తురాలు చూచుచుండెను. ఆమె యింటినిండ భక్తులు దిగేవారు. ఆమె వారికి కావలసినవన్నియు సమకూర్చుచుండెను. ఉత్సవమునకు కావలసినవన్నియు సిద్ధపరచుచుండెను. ఆమె స్వయముగా మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదుగోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసితో నిండియుండెడివి. వానిని చక్కగా కడిగి సున్నము పూయుచుండెను. ఒక్కొక్కప్పుడు మండుచున్న ధునికూడ తీసి బయట పెట్టుచుండెను. ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజుముందే చేయుచుండెను. బీదలకు అన్నదానమనగా బాబాకు చాలప్రీతి. అందుచే బీదలకు అన్నదానము ఈ యుత్సవముయందు విరివిగా చేయుచుండిరి. వంటలు విస్తారముగ, మిఠాయిదినుసులతో రాధాకృష్ణమాయి ఇంటిలో చేయుచుండిరి. ఇందులో అనేకమంది భక్తులు పూనుకొనుచుండెడివారు.
మేళా లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట
ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను. రాను రాను వృద్ధియగుచుండెను. 1912లో నొక మార్పుజరిగెను. “సాయి సగుణోపాసన”ను వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మయనువాడు దాదాసాహెబు ఖాపర్డే (అమరావతి నివాసి)తో నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బసచేసిరి. కృష్ణారావు వసారాలో చేరగిలి యుండగా కాకామహాజని పూజాపరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక క్రొత్తయాలోచన తట్టెను. వానిని పిలిచి యిట్లనెను. “ఈ యుత్సవమును శ్రీరామనవమినాడు చేయుటలో భగవదుద్దేశ మేదియో యుండవచ్చును. శ్రీరామనవమి యుత్సవమనగా హిందువులకు చాల ముఖ్యము. కనుక యీ దినమందు శ్రీరామనవమి యేల జరుపకూడ”దని యడిగెను. కాకామహాజని యీ యాలోచనకు సమ్మతించెను. బాబా యనుమతి దెచ్చుటకు నిశ్చయించిరి. ఒక కష్టము మాత్రము తీరనిదిగా గాన్పించెను. అది హరిదాసును సంపాదించుట. భగవన్మహిమలను కీర్తనచెయుటకు హరిదాసు నెచ్చటనుండి తేవలెననునది గొప్ప సమస్యగా నుండెను. తుదకది భీష్ముడే పరిష్కరించెను. ఎట్లన, అతని రామాఖ్యానమను శ్రీ రాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే నతడు దానిని కీర్తన చేయుటకు, కాకామహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి. చక్కెరతో కలిపిన శొంఠిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా యనుమతి బొందుటకై మసీదుకు పోయిరి. అన్నిసంగతులు మసీదునందుండియే గ్రహించుచున్న బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా యడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవుటచే బాబా యదేప్రశ్న భీష్ముడనడిగెను. అతడు శ్రీరామ నవమి యుత్సవము చేయ నిశ్చయించితి మనియు నందులకు బాబా యనుమతి నివ్వవలెననియు కోరెను. బాబా వెంటనే యాశీర్వదించెను. అందరు సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటిదినమున మసీదు నలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఊయల వ్రేలాడగట్టిరి. దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను. శ్రీరామజన్మోత్సవము ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. అప్పుడే లెండీ వనమునుండి మసీదుకు వచ్చిన బాబా, అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. అతడు కొంచెము జంకెను. జన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో యని అతడు సంశయించెను. అతడు బాబావద్దకు వెళ్ళిన తోడనే యిదినంతయు యేమని బాబా యడిగెను. ఆ ఊయల యెందుకు కట్టిరని యడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులోనుండు భగవంతుని నిర్గుణస్వరూపమగు ‘నింబారు’ (గూడు) నుండి యొక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి యింకొకటి భీష్మునకి పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. కొంతసేపటికి కథ ముగిసెను. ‘శ్రీ రామచంద్రమూర్తికీ జై’ యని ఎర్రగుండ బాజాభజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన బడునట్లు విరివిగా జల్లిరి. అందరు సంతోషములో మునిగిరి. అంతలో నొకగర్జన వినబడెను. చల్లుచుండిన గులాల్ యను ఎర్రపొడుము ఎటులనో బాబా కంటిలో పడెను. బాబాకోపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. జనులందరు ఇది చూచి భయపడి పారిపోయిరి. కాని బాబా భక్తులు, అవన్నియు తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా యాశీర్వాదములని గ్రహించి పోకుండిరి. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే యహంకారమును, దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబారూపములోనున్న రాముడు తప్పక కోపించవలెననిరి. షిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక యలవాటు. దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతనివద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నుత్సవము పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి యా మరుసటిదినము శ్రీకృష్ణజననమునాడు పాటించు ‘కాలాహండి’ యను నుత్సవము జరిపినపిమ్మట తీసివేయవచ్చునని చెప్పెను. కాలాహండి యనగా నల్లనికుండలో అటుకులు, పెరుగు, ఉప్పుకారముకలిపి వ్రేలాడ గట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులగు గొల్లపిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను. ఆ మరుసటిదినము ఇవన్నియు పూర్తియైనపిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవసమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండెను. అప్పటినుండి జాతర (మేళ) శ్రీరామనవమి యుత్సవముగా మారెను.
1913 నుంచి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు హెచ్చించిరి. చైత్రపాడ్యమినుంచి రాధాకృష్ణమాయి ‘నామసప్తాహము’ ప్రారంభించుచుండెను. భక్తులందరు అందు పాల్గొందురు. ఆమె కూడ వేకువజామున భజనలో చేరుచుండెను. దేశమంతట శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథాకాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5, 6 రోజులు ముందు మహాజని బాలబువ మాలీని (ఆధునిక తుకారామ్) కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కొనివచ్చెను. ఆ మరుసటి సంవత్సరము అనగా 1914లో సతారాజిల్లా బిర్హాడ్ సిద్ధకవఠె గ్రామములోని హరిదాసుడగు బాలబువ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచేత కథలు చెప్పక ఖాళీగానుండెను. బాబా యనుమతి కాకా ద్వారా పొంది అతడు షిరిడీ చేరెను. హరికథ చెప్పెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను 1914వ సంవత్సరములో శ్రీ సాయి పరిష్కరించెను. ఈపని శాశ్వతముగా దాసగణు మహారాజునకు అప్పగించెను. ఈనాటివరకు దాసగణు ఈ కార్యమును జరుపుచున్నారు.
1912 నుండి ఈ యుత్సవము రానురాను వృద్ధిపొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తుమ్మెదల పట్టువలె ప్రజలతో నిండుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీలలో ననేకమంది పాల్గొనుచుండిరి. బీదలకు అన్న సంతర్పణ బాగుగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శ్రీసాయిసంస్థాన మేర్పడెను. అలంకారములు; ఆడంబరము లెక్కువాయెను. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రథము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులుకూడ వచ్చెను. ఇవన్నియు హెచ్చినప్పటికి సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు. ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్యవిషయమేమన హిందువులు, మహమ్మదీయులు కలసిమెలసి యెట్టి కలహములు లేకుండ గడిపేవారు. మొదట 5,000 మొదలు 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. తుదకు 75,000 వరకు రాజొచ్చిరి. అంతమంది గుమిగూడినప్పిటికి ఎన్నడైనను వ్యాధులుకాని జగడములుగాని కనిపించలేదు.