షిరిడీజనులు పుణ్యాత్ములు. వారి యిండ్లయెదుట బాబా భిక్షుకుని వలె నిలచి “అక్కా! రొట్టెముక్క పెట్టు” అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. ఒకచేతిలో తంబిరేలుడొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలీ పట్టుకొని పోవువారు. ప్రతిరోజు కొన్నియిండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసికొనెడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు. బాబాకు రుచి యనునది లేదు. వారు నాలుకను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్నివస్తువులును డొక్కులోను, జోలెలోను వేసికొనెడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సంతుష్టిచెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా సరిగ 12 గంటలవరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను. ఒక్కొక్కదినమందు కొన్ని యిండ్లకు మాత్రమే పోయెడి వారు. సాధారణముగా 12 గంటలవరకు భిక్షచేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమే వారు కారు. మసీదు తుడిచి శుభ్రముచేయు స్త్రీ 10, 12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసికొనుచుండెడిది. కుక్కలను, పిల్లులను, కలలోగూడా యడ్డుపెట్టనివారు, ఆకలిబాధతో నున్న మానవులకు భోజనము పెట్టుట మానుదురా? ఆయన జీవితము మిగుల పావనమైనది.
మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చిఫకీరని పిలిచెడివారు. ఎవరయితే భోజనోపాధికై గ్రామములో రొట్టెముక్కలపై నాధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా? వారి మనస్సు, చేయి ధారాళమయినవి, ధనాపేక్షలేక దాక్షిణ్యము చూపువారు. బయటికి చంచలముగ సుస్థిరత్వములేని వారుగ గాన్పించినను లోన వారు స్థిరమనస్సు గలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామములో కూడ దయార్ద్రహృదయులును, వవిత్రులును కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి.