ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో యందరికి తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడు నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసికొని సరిగాచేయును. బిడ్డకు ఈ విషయమేమియు తెలియదుగాని తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి యలంకరింపబడుట చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చ దగిన దేదియు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము. సద్గురువులు కూడ నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు