- గురువులమని చెప్పుకొని తిరుగువా రనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది, వారి వద్దనుంచి ధనము లాగెదరు. పవిత్రమార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కాని మత మనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారపవిత్రులు.
- సాయిబాబా తన గొప్పతన మెన్నడును ప్రదర్శించవలె నను కొనలేదు. వారికి శరీరాభిమానము ఏమాత్రము లేకుండెను, కాని భక్తులయందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది. నియతగురువులని అనియతగురువులని గురువులు రెండు విధములు. నియతగురువులనగా నియమింపబడినవారు. అనియతగురువులనగా సమయానుకూలముగ వచ్చి యేదైన సలహానిచ్చి మన యంతరంగముననున్న సుగుణమును వృద్ధిచేసి మోక్షమార్గము త్రొక్కునట్లు చేయువారు. నియతగురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వాభిప్రాయము పోగొట్టి యోగమును ప్రతిష్ఠించి “తత్వమసి” యగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచజ్ఞానమును బోధించుగురువు లనేకులు గలరు. కాని మనల నెవరయితే సహజస్థితియందు నిలుచునట్లు జేసి మనలను ప్రపంచపుటునికికి అతీతముగా తీసికొని పోయెదరో వారు సద్గురువులు. సాయిబాబా యట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో, బాబా వారి యొక్క భూతభవిష్యద్వర్తమానము లన్నిటిని చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును జూచేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. దుర్మార్గుల యవసరముల గూడ దీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. వారు మానవశరీరముతో నున్నప్పటికి, వారికి శరీరమందు గాని, గృహమందుగాని యభిమానము లేకుండెను. వారు శరీరధారులవలె గనిపించినను నిజముగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు.
- బాబాను భగవానునివలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. తినుచు, త్రాగుచు, తమ దొడ్లలోను పొలములలోను పని చేసికొనుచు, వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తియందుంచుకొని సాయి మహిమను కీర్తించు చుండేవారు. సాయితప్ప యింకొక దైవమును వారెరిగియుండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు అజ్ఞాను లయినప్పటికి ప్రేమతో పాటలను కూర్చుకొని వారికి వచ్చు భాషాజ్ఞానముతో పాడుచుండిరి. వారికి అక్షరజ్ఞానము శూన్యమయినప్పటికి వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము తెలివివలన రాదు. కాని యది యసలైన ప్రేమవలన వెలువడును. సిసలైన కవిత్వము స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును. బుద్ధిమంతు లది గ్రహించగలరు. ఈ పల్లె పాటలన్నియు సేకరింపదగినవి. ఏ భక్తుడయిన వీనిని శ్రీ సాయిలీల సంచికలో ప్రకటించిన బాగుండును.