బాబా తన భక్తులను వారి వారి యిష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగజేసికొనుట బాబా కిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావిశీబాయియే యింకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి, యితర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి. “అమ్మా! కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు”. ఇట్లనగనే, బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పుకణములవలె ఎర్రనాయెను. బాబాను జూచుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకొనెను. ఇంకొకచివరను స్తంభమునకు నాటించెను. సటకా యంతయు పొత్తికొడుపులో దూరునట్లు కానవచ్చుచుండెను. కొద్ది సేపటిలో పొత్తికడుపు ప్రేలు ననుకొనిరి. బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి. ఆశ్చర్యముతోను, భయముతోను మాట్లాడలేక మూగవాండ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హానిలేకుండ తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి. దానికికూడ బాబా యొప్పుకొనలేదు. వారి మంచి యుద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియు చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపయి కూర్చుండిరి. అప్పటినుండి భక్తుల యిష్టానుసారము సేవచేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ యెట్టిదో బాబాకే గుర్తు.