మహాల్సాపతి గారు
మహల్సాపతి
శ్రీసాయిబాబా సశరీరులుగా ఉండగా వారిని ప్రత్యక్షంగానూ, అత్యంత సన్నిహితంగానూ సేవించుకున్న భక్తులలో అత్యంత ముఖ్యుడు, మొదటగా పేర్కొనవలసిన భాగ్యశాలి మహల్సాపతి. బాబా ఇతనిని ప్రేమగా ‘భగత్‘ అనీ, ‘సోనార్డా‘ అనీ పిలిచేవారు. ఇతని పూర్తిపేరు మహల్సాపతి చిమ్నాజీ నాగరే. శిరిడీ గ్రామానికి చెందిన పేద విశ్వబ్రాహ్మణ కుటుంబంలో (సుమారు 1834లో) జన్మించాడు మహల్సాపతి. వీధిబడిలో ప్రాథమిక విద్యాభ్యాసం తప్ప పెద్దగా అక్షరజ్ఞానం లేనివాడు. తమ కులదైవమైన ఖండోబా (ఖండోబాకే మహల్సాపతి అని మరో పేరు. ‘మహల్సా’ అంటే పార్వతీదేవి. మహల్సాపతి అంటే పార్వతీపతి, అంటే శివుడు అని అర్థం) పట్ల అత్యంత భక్తిప్రపత్తులు కలిగి ఉండేవాడు. వంశపారంపర్యంగా ఖండోబా మందిరంలో అర్చకత్వం చేస్తుండేవాడు. ఖండోబాకు సంబంధించిన ‘మహల్సా పురాణం’ అనే పవిత్ర గ్రంథాన్ని ప్రతినిత్యమూ పఠిస్తుండేవాడు. సాటి కులస్థుల ఇండ్లలో జరిగే మతపరమైన కార్యక్రమాలలో పౌరోహిత్యం చేసేవాడు. ఖండోబాపట్ల అతనికున్న భక్తి ఫలప్రదమై అప్పుడప్పుడు మానసికంగా ఖండోబాతో తాదాత్మ్యం చెందేవాడు. ఆ సమయంలో సమాధి స్థితిని, వివిధ దర్శనాలను పొందేవాడు. ఆ స్థితిలో అతను ఏవేవో మాట్లాడేవాడు. ప్రజలు ఖండోబా అతనిని ఆవహించి, అతని ద్వారా మాట్లాడుతున్నారని అనుకునేవారు.
మహల్సాపతి కుటుంబీకులు తరతరాలుగా శిరిడీలోనే నివసిస్తుండేవారు. ఆ గ్రామంలో వాళ్లకు ఉన్నది ఒక మట్టిఇల్లు, ఏడున్నర ఎకరాల మెట్టభూమి మాత్రమే. నీటి వసతుల కొరత కారణంగా ఆ భూమి ద్వారా అతనికి ఎటువంటి రాబడీ ఉండేది కాదు. గ్రామానికి వెలుపల మట్టితో నిర్మింపబడిన పురాతన ఖండోబా మందిరం కూడా వారిదే అయినప్పటికీ భక్తుల ద్వారా దక్షిణ రూపంలో వచ్చే మొత్తం అంతంతమాత్రమే ఉండేది. అది కూడా చాలావరకు మందిర నిర్వహణకే సరిపోయేది. అందువలన మందిరం ద్వారా కూడా మహల్సాపతి కుటుంబానికి పెద్దగా ఆదాయం ఉండేది కాదు. అందుచేత కుటుంబ పోషణకోసం అతను వంశపారంపర్యంగా వస్తున్న స్వర్ణకార(సోనార్) వృత్తి చేస్తుండేవాడు. కానీ శిరిడీ ఒక మారుమూల కుగ్రామం. అక్కడ చాలా తక్కువ ఇళ్ళు ఉండేవి. ఇతర గ్రామాల నుండి వచ్చి మహల్సాపతికి పని ఇచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉండేవారు. అందువలన స్వర్ణకారవృత్తి వలన వచ్చే ఆదాయం కూడా చాలా స్వల్పంగానే ఉండేది. ఆ కొద్దిపాటి ఆదాయంతోనే అతను తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఏ బాధాలేక నిశ్చింతగా ఆధ్యాత్మిక చింతనలో, ఆచారవ్యవహారాలలో నిమగ్నమైవుండేవాడు. చాలామంది సదాచార హిందువుల మాదిరిగానే మహల్సాపతి కూడా తాను ఖండోబా కృపతో జననమరణ చక్రం నుండి బయటపడాలనీ, మోక్షాన్ని పొందాలనీ లక్ష్యంగా కలిగివుండేవాడు. ఆ లక్ష్యసాధనకు అవసరమైన సాత్విక స్వభావాన్ని కలిగి ఉండటంతోపాటు సాధుసత్పురుషుల సాంగత్యం చేస్తుండేవాడు.
మహల్సాపతికి శిరిడీ గ్రామస్థులైన కాశీరాంషింపీ, అప్పాజోగ్లే(అప్పాభిల్)లతో మంచి స్నేహబంధముండేది. ముగ్గురూ ప్రేమ స్వభావులు, అతిథి సత్కారాలలో ఆసక్తిగలవారు. ఈ ముగ్గురూ శిరిడీ సందర్శించే సాధుసత్పురుషులను ఆదరించి అన్నం పెట్టడం, వారికి ఆశ్రయం కల్పించడం, వారి ఇతర అవసరాలను సమకూర్చడం, వారికి పరిచర్యలు చేయడం వంటి బాధ్యతలను సమిష్టిగా నిర్వర్తిస్తుండేవారు. వాళ్లలో కాశీరాంషింపీ అతిథులకు ఆహారపదార్థాలను, అప్పాజోగ్లే కట్టెలు, పాత్రలు వంటివి అందిస్తే, పేదవాడైన మహల్సాపతి మాత్రం అలసిపోయిన వారి కాళ్ళు పట్టి వారికి పాదసేవ చేసేవాడు. వాళ్ళ అతిథ్యంలో అతిథులు అత్యంత గౌరవాన్ని, ఆప్యాయతను పొందేవారు. వాళ్ళు హిందూమతానికి చెందిన సాధువులను మాత్రమే కాకుండా ముస్లిం ఫకీర్లను కూడా సాదరంగా ఆహ్వానించి ఆదరించేవారు. వాళ్ళు గోసావిలను ‘నమో నారాయణా‘ అనీ, బైరాగులను ‘జై రామ్‘ అనీ, ఫకీరులను ‘జై సాయి‘ అని స్వాగతించేవారు.
దక్షిణాన ఉన్న పండరీపురం, రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రధాన మార్గంలో శిరిడీ ఉన్నందున ఎంతోమంది సాధువులు ఆ గ్రామంలో బసచేస్తుండేవారు. సాయిబాబా శిరిడీ రావడానికి పన్నెండు సంవత్సరాల ముందు దేవీదాసు అనే సాధువు శిరిడీ వచ్చి అక్కడ నివాసమేర్పరుచుకున్నాడు. కొద్దిరోజుల్లోనే అతని కీర్తి శుక్లపక్ష చంద్రుడివలే దినదినాభివృద్ధి చెందింది. అతను జ్ఞాని. అతని తేజోవంతమైన కన్నులు, చక్కటి శరీరాకృతి చూసేవారిని ఇట్టే పాదాక్రాంతులను చేసుకొనేవి. వివిధ శాఖలకు చెందిన సాధువులు అతని దర్శనానికి వస్తుండేవారు. మహల్సాపతి, అప్పాభిల్, కాశీరాంషింపీ తదితరులు తరచూ దేవీదాసుని దర్శించేవారు. కాశీరాం అతనికి వస్త్రాలు, బియ్యం, జొన్నలు సమర్పించుకొనేవాడు. తన వద్దకు వచ్చే భక్తుల కోసం దేవీదాసు ఒక పలకపై శ్రీవేంకటేశస్తోత్రం వ్రాసిచ్చి, దానిని వారిచేత పఠింపజేశారు. కాశీరాంషింపీ వంటి కొందరు దేవీదాసుని తమ గురువుగా స్వీకరించారు. మహానుభావ పంథాకు చెందిన జానకీదాసు అనే పుణ్యాత్ముడు కూడా ఆ కాలంలో శిరిడీలో నివాసముంటుండేవాడు.
బాబా సుమారు పదహారేళ్ళ యువకుడిగా అకస్మాత్తుగా శిరిడీలో ప్రకటమై అదేవిధంగా హఠాత్తుగా అదృశ్యమయ్యారు. మూడేళ్ళ తరువాత (సుమారు 1872 ప్రాంతంలో) ధూప్ఖేడ్ గ్రామానికి చెందిన చాంద్భాయ్పాటిల్ పెళ్లిబృందంతో బాబా మళ్ళీ శిరిడీ వచ్చారు. శిరిడీ పొలిమేరల్లో ఉన్న ఖండోబా మందిర సమీపంలో ఆ పెళ్ళిబృందం నుండి విడివడి మందిర ప్రవేశద్వారం వద్దకు వెళ్లారు బాబా. మందిరం లోపల ఖండోబా ఆరాధనలో నిమగ్నమైవున్న మహల్సాపతి బాబా ఉనికిని గమనించి, ముస్లిం వేషధారణలో ఉన్న బాబాను తన సాధారణ అలవాటు ప్రకారం ‘ఆవో(రండి) సాయి‘ అంటూ సాదరంగా ఆహ్వానించాడు. అంతకుముందు, ఆ తరువాత కూడా బాబా పేరుగానీ, ఇతర వివరాలుగానీ ఎవ్వరికీ తెలియవు. మహల్సాపతి ‘సాయి’ అని పిలిచినప్పటినుండి అదే ఆయన పేరుగా స్థిరపడింది. అంటే, ఒకవిధంగా బాబాకు నామకరణం చేసింది మహల్సాపతే! ఈనాడు ఎందరో భక్తులకు తారకమంత్రమైన శ్రీసాయి నామాన్ని మనకందించింది మహల్సాపతే!
కొంతసేపటి తరువాత బాబా మహల్సాపతితో, “ఈ ఖండోబా మందిరం ఏకాంతంగా, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఫకీరు ఉండటానికి సరిగ్గా సరిపోతుంది” అని అన్నారు. వాస్తవానికి మహల్సాపతికి మతమౌఢ్యంగానీ, ముస్లింల పట్ల, వారి విశ్వాసాల పట్ల ద్వేషంగానీ లేకపోయినప్పటికీ, తమ సంప్రదాయం పట్ల ఉన్న మక్కువతోనూ, చాలామంది ముస్లింలు హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తారన్న భయంతోనూ ఖండోబా మందిరంలో ప్రవేశానికి బాబాకు అభ్యంతరం చెప్పాడు మహల్సాపతి. మహల్సాపతి మనసెరిగిన బాబా అతనితో, “హిందువులకు, ముస్లింలకు దైవం ఒక్కడే. అయినప్పటికీ నువ్వు నా ప్రవేశానికి అభ్యంతరం చెప్తున్నావు గనక నేను వెళ్తాను” అని అక్కడినుండి వెళ్లిపోయారు. అలా వెళ్ళిన బాబా ఎక్కువగా వేపచెట్టు క్రింద నివసించేవారు. మహల్సాపతి తన స్నేహితులైన కాశీరాంషింపీ, అప్పాజోగ్లేలను బాబాకు పరిచయం చేశాడు. తరచూ వాళ్ళు ముగ్గురూ బాబాను వేపచెట్టు క్రింద దర్శిస్తుండేవారు.
తొలిరోజుల్లో బాబా వ్యవహారశైలి శిరిడీ గ్రామస్తులకు వింతగా తోచేది. అందువలన ఆయనొక పిచ్చి ఫకీరని జనం తలచేవారు. మహల్సాపతికి, అతని మిత్రులకు కూడా మొదట్లో అలాగే అనిపించేది. కానీ ఉన్మత్తావస్థలో ఉన్న సిద్ధపురుషుల ప్రవర్తన బాహ్యానికి వెర్రితనంగా ఉంటుందని తెలిసిన మహల్సాపతి బాబా వింత ప్రవర్తన మాటున దాగియున్న వారి దివ్యత్వాన్ని గుర్తించాడు. అందువలన ఇతరులు బాబాపట్ల గౌరవాన్ని కోల్పోయినప్పటికీ మహల్సాపతి మాత్రం బాబాపట్ల గౌరవభావాన్ని కలిగి ఉండేవాడు. అందుకు కారణమొక్కటే, బాబా యొక్క సాధారణ ప్రవర్తన ద్వారా మహల్సాపతి వంటి కొందరి దృష్టిలో బాబా పట్ల ఉద్భవించిన గొప్ప గౌరవభావాన్ని అప్పుడప్పుడు ఆయన ప్రదర్శించే పిచ్చి వైఖరి పెద్దగా నిరోధించలేకపోయింది. ఇతరులు బాబా నీటితో దీపాలు వెలిగించడం వంటి అలౌకిక లీలలను చూసిన తరువాతే వారి మహిమను గుర్తించి వారిని దైవంగా ఆరాధిస్తే, మహల్సాపతి మాత్రం బాబా యొక్క అతి నిర్మలము, పరిశుద్ధము అయిన సాధుజీవనాన్ని, సత్వగుణాన్ని, పూర్ణ వైరాగ్య ప్రవృత్తిని చూసి వారిపట్ల తొలిరోజుల్లోనే ఆకర్షితుడయ్యాడు. అదీగాక, బాబా తరచూ సాంగత్యం చేస్తుండే జానకీదాసు, దేవీదాసు తదితర సాధుసత్పురుషులతో పోల్చి చూసినప్పుడు బాబా ఎంతో జ్ఞానసూర్యుని వలె ప్రకాశించడాన్ని, ఆ సత్పురుషులు సైతం బాబాను అమితంగా గౌరవించడాన్ని మహల్సాపతి గమనించాడు. క్రమంగా బాబా సాన్నిహిత్యంలో తన సమయాన్ని ఎక్కువగా గడుపుతుండేవాడు మహల్సాపతి.
ఇలా ఉండగా, 1880-90 మధ్యకాలంలో తన ఒక్కగానొక్క కుమారుడు ఒక సంవత్సరం వయసులోపే మరణించడంతో మహల్సాపతి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ కారణంగా, పెళ్ళికాని ముగ్గురు కుమార్తెల బాధ్యత తన నెత్తిపై ఉన్నప్పటికీ మహల్సాపతికి ప్రాపంచిక వ్యవహారాలపట్ల, జీవితంపట్ల ఆసక్తి సన్నగిల్లింది. ఆ సమయంలో ఖండోబా అతనికి రెండు స్వప్నదర్శనాలను అనుగ్రహించారు. మొదటి స్వప్నంలో, ‘మందిరంలో ఉన్న తమ విగ్రహాన్ని ఇంటికి తీసుకుపోయి, ఏకాగ్ర చిత్తంతో ఆరాధించమ’ని ఖండోబా మహల్సాపతిని ఆదేశించారు. రెండవ స్వప్నంలో ఖండోబా ఒక బ్రాహ్మణుని రూపంలో కనిపించి, “ఏం నాయనా! స్వర్ణకారవృత్తి చేయకుండా కడుపు నింపుకోలేవా?” అని అడిగారు. అందుకు మహల్సాపతి, “అలాగే, నేను ఆ వృత్తిని వదులుకుంటాను” అని అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, “నా పాదాలు తాకి, వాటిని గట్టిగా పట్టుకో! ఇకమీదట నీ జీవనం నా పాదాలను పట్టుకోవడం మీద ఆధారపడి ఉంటుంది గానీ, స్వర్ణకారవృత్తిపై కాదు” అని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పటినుండి మహల్సాపతి స్వర్ణకారవృత్తిని వదిలిపెట్టి పూర్తి శ్రద్ధ, నిష్ఠలతో భిక్షావృత్తిని చేపట్టాడు. భార్యాబిడ్డలున్నప్పటికీ, ఇంట్లో నిద్రించడం వలన ప్రాపంచిక సంబంధాలు బలపడతాయని, సంసారభారం, బాధ్యతలు మరింత అధికమవుతాయన్న నెపంతో ఇంట్లో నిద్రించడం మానుకొని బాబాతోపాటు మసీదులో నిద్రించనారంభించాడు. బాబా సన్నిధిలో ఉండటమే తన ప్రధాన కార్యాచరణగా మార్చుకొని ఒక్కరోజు కూడా ఆ నియమాన్ని తప్పేవాడు కాదు. మహల్సాపతి ప్రతిరోజూ రాత్రి భోజనానంతరం మసీదుకు వెళ్లి తన వస్త్రాన్ని నేలపై పరిచేవాడు. దానిపై ఒకవైపు బాబా, మరోవైపు మహల్సాపతి విశ్రమించేవారు.
మహల్సాపతికి బాబా కఠిన నియమాలు విధించి ఎన్నో సాధనలు చేయించేవారు. బాబా అతనితో, “భగత్! నువ్వు నిద్రపోవద్దు. స్థిరంగా కూర్చొని నీ చేతిని నా హృదయంపై ఉంచు. నేను అల్లాను స్మరిస్తూ సమాధి స్థితిలో ఉంటాను. నామస్మరణ జరుగుతున్నంతసేపూ నా హృదయస్పందన ఒక రకంగా ఉంటుంది. నేను నిద్రలోకి జారితే నా హృదయస్పందన మారుతుంది. అకస్మాత్తుగా నామస్మరణ ఆగితే నన్ను నిద్ర ఆవరించినట్లు. వెంటనే నన్ను నిద్రలేపు” అని చెప్పేవారు. అయితే, బాబా హృదయంలో నామస్మరణ ఆగినదీ లేదు; అతడాయనను నిద్రలేపినదీ లేదు. అలా ఆ ఇద్దరూ రాత్రంతా మెలకువగా ఉండేవారు. రాత్రి ఒకసారి మహల్సాపతి మసీదులో అడుగుపెట్టాక ఎట్టి పరిస్థితుల్లోనూ, కనీసం లఘుశంకకు వెళ్లాల్సి వచ్చినా సరే, బాబా అతనిని మసీదు మెట్లు దిగడానికి అనుమతించేవారు కాదు. “మసీదు మెట్లు దిగితే చచ్చిపోతావు, జాగ్రత్త” అని హెచ్చరించేవారు. ఆ విధంగా రాత్రిళ్ళు మహల్సాపతిని నిద్రపోనీయక, జాగరూకతతో తాము విధించిన సాధనలు చేయించారు బాబా. పగలూ రాత్రీ బాబా సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ మహల్సాపతి ఎంతో ఆనందాన్ని, ప్రయోజనాన్ని పొందుతుండేవాడు. ఇలా ఎన్నో ఏళ్ళు ఆ సద్గురు సన్నిధిలో అతని తపస్సు సాగింది. సుమారు 40, 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో బాబా మహల్సాపతికి ఎన్నోవిధాల ఎంతో ప్రయోజనం చేకూర్చి ఉంటారు. ఆ వివరాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, బాబా మహల్సాపతిని భక్తి, శరణాగతి, ఆత్మార్పణ విషయంలో ఉన్నత స్థానంలో ఉంచారు.
బాబా తమ భక్తుల పారమార్థిక పురోగతి విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా జాగ్రత్త తీసుకొనేవారు. ఆ ప్రయత్నంలో ఆయన తమ భక్తులను కఠినంగా పరీక్షించేవారు. బాబా తాము మహాసమాధి చెందడానికి 32 సంవత్సరాల ముందు మహల్సాపతికి చాలా విచిత్రమైన, కఠినమైన పరీక్షను పెట్టారు. బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడేవారు. 1886వ సంవత్సరం మార్గశిరమాసంలో కూడా ఒకసారి బాబా తీవ్రమైన ఉబ్బసంతో బాధపడసాగారు. మహల్సాపతి బాబా చెంతనే ఉంటూ అహర్నిశలు బాబాను సేవించుకుంటున్నాడు. మార్గశిర శుద్ధపౌర్ణమినాటి రాత్రి సుమారు పది గంటల సమయంలో బాబా అకస్మాత్తుగా మహల్సపతితో, “భగత్! నేను అల్లా వద్దకు వెళుతున్నాను. మూడు రోజుల్లో తిరిగి వస్తాను. అంతవరకు ఈ దేహాన్ని జాగ్రత్తగా చూసుకో. మూడవరోజు ముగిసే సమయానికి ఒకవేళ నేను తిరిగి రాకపోతే, (మసీదు వద్దనున్న ఆరుబయలు ప్రదేశాన్ని చూపిస్తూ) అక్కడొక సమాధి త్రవ్వి, అందులో ఈ దేహాన్ని ఉంచి, గుర్తుగా రెండు జెండాలు నాటు” అన్నారు. మహల్సాపతికి బాబా మాటలు అర్థమయ్యేలోగానే బాబా దేహం అచేతనంగా మారి మహల్సాపతి ఒడిలో ఒరిగిపోయింది. వారి శ్వాస, నాడి ఆగిపోయాయి. ఈ హఠాత్పరిణామానికి ఏం చేయాలో మహల్సాపతికి తోచలేదు. అయినప్పటికీ బాబా ఆదేశాన్ని స్మరించి వారి దేహాన్ని సంరక్షిస్తూ అక్కడే కూర్చున్నాడు. అప్పటికింకా బాబా మహిమ అంత ప్రఖ్యాతం కాలేదు. బాబా మహాత్మ్యాన్ని గుర్తించిన కొందరు భక్తులకు కూడా బాబా మరణించిన తరువాత మేల్కొనగలంతటి మహిమాన్వితుడనే పూర్తి విశ్వాసం లేదు. అందువలన అందరూ బాబాపై ఆశను వదులుకున్నారు. గ్రామపాటిల్ (కులకర్ణి) పంచనామా జరిపించి, అంత్యక్రియల కొరకు ఏర్పాట్లు ప్రారంభించాడు. కానీ మహల్సాపతి మాత్రం ఆశను విడవలేదు. బాబా శరీరాన్ని తన ఒడిలో నుండి ఒక్క అంగుళం కూడా కదలనివ్వలేదు. నిద్రాహారాలు మాని పగలనక, రేయనక కంటికిరెప్పలా బాబా దేహాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మూడురోజులూ అలాగే కూర్చున్నాడు. మూడురోజులు గడిచాక తెల్లవారుఝామున మూడుగంటలకు బాబా శరీరంలో జీవం వచ్చినట్లుగా అనిపించింది. బాబా శ్వాస తీసుకోనారంభించారు. ఆపై నెమ్మదిగా కనులు తెరిచి, కాళ్ళుచేతులు సాగదీస్తూ లేచి కూర్చున్నారు. అటుపై బాబా 32 సంవత్సరాలు తమ అవతారకార్యాన్ని కొనసాగించారు. బాబా దేహాన్ని ఖననం చేయాలని పట్టుబట్టిన అధికారులను సైతం ఎదిరించి మూడురోజులపాటు బాబా దేహాన్ని సంరక్షించి, బాబాకే కాక, యావత్ సాయిభక్తులకు, సామాన్య ప్రజానీకానికి మహల్సాపతి చేసిన సేవ అరుదైనది. అంతటి కార్యాన్ని నెరవేర్చడంలో అతను ఏ మాత్రం వైఫల్యం చెందినా, బాబా దేహాన్ని ఖననం చేసి ఉన్నా చరిత్ర గమనం మరోలా ఉండేదేమో! కానీ మహల్సాపతి ఆ కార్యాన్ని ఎంతో నిబద్ధతతో సమర్థవంతంగా పూర్తిచేశాడు. అది బాబాపట్ల మహల్సాపతికి ఉన్న నిజమైన ప్రేమకు, భక్తికి, విశ్వాసానికి నిదర్శనం. ఇంతటి అనుబంధానికి గుర్తింపుగా బాబా అతనిని ‘భగత్‘ (‘భక్తా’) అని పిలిచేవారు. సాయిభక్తుడు బి.వి.దేవ్ ‘మహల్సాపతి స్మృతులు’ అనే పుస్తకం యొక్క ముందుమాటలో మహల్సాపతిని ‘భక్తమాణిక్యం‘ అనీ, ‘మహాత్మా‘ అనీ సంబోధించారు. అవి అతనికి సరిగా సరిపోతాయి.
మహల్సాపతికి బాబాపట్ల ఉన్న ప్రేమకు అద్దంపట్టే మరో సంఘటన గురించి తెలుసుకుందాం. బాబా ఒక్కొక్కప్పుడు తనను గ్రామంలోని వర్తకులు, నూనె వ్యాపారులు ఎంతగానో బాధించారంటూ, తాము శిరిడీ విడిచి వెళ్ళిపోతామని కోపంగా బయల్దేరేవారు. ఒకసారి ఆయన అలానే కోపగించుకొని ఎవరికీ చెప్పకుండా శిరిడీ విడిచి వెళ్ళిపోయారు. బాబా శిరిడీలో కన్పించడంలేదని భక్తులందరూ ఆందోళనగా చెప్పుకోసాగారు. ఆ వార్త ఖండోబా ఆలయంలో పూజ చేసుకుంటున్న మహల్పాపతికి చేరింది. అతడు వెంటనే వచ్చి గ్రామంలో విచారించగా, “బాబా రహతాకు గానీ, నీమ్గాఁవ్కు గానీ వెళ్ళలేదనీ, ఆయన గ్రామం విడిచి వెళ్ళే ముందు తీవ్రమైన కోపావేశంలో వున్నార”నీ కొందరు గ్రామస్థులు చెప్పారు. ఇంతలో, “బాబా లెండీ నుండి నీమ్‌గాఁవ్ వైపుకు బయల్దేరడం మాత్రం చూచామ”ని ఎవరో చెప్పారు. వెంటనే మహల్సాపతికి బాబా శిరిడీలో మొదటిసారి ప్రకటమైన కొద్దికాలానికి ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం గుర్తొచ్చి, ఈసారి బాబా మళ్ళీ తిరిగి శిరిడీ వస్తారో లేదోనని భయమేసింది. అంతే! మహల్సాపతికి కాలు, మనసు నిలువలేదు. బాబా లేని ఆ గ్రామంలో జీవించడం అతడికి అసాధ్యమనిపించింది. వెంటనే మహల్సాపతి ఆ రోడ్డు మీద ఉత్తరంగా కొద్దిదూరం వెళ్ళి, అక్కడ ఎదురైనవారిని బాబా గురించి వాకబు చేశాడు. తరువాత నీమ్‌గాఁవ్ రోడ్డు మీద నుంచి తూర్పుగా రూయీ గ్రామం వైపు నడిచి అక్కడొక పొలంలో పనిచేసుకునేవారిని విచారించగా, “బాబా రూయీ గ్రామం మీదుగా వెళ్ళార”ని చెప్పారు. అంతేకాదు, వారాయనను పలకరించినపుడు ఆయన పట్టరాని కోపంతో శిరిడీ గ్రామస్థులను తిట్టిపోశారనీ, ‘తాము తిరిగి ఆ గ్రామానికి రాబోన’ని అన్నారనీ చెప్పారు. ఆ విషయం వినగానే మహల్సాపతిలో ఆశాజ్యోతి పొడజూపింది. అతడు తిరిగి వెంటనే ఇల్లు చేరి, ‘తాను రూయీ గ్రామంలో బాబా చెంతకు వెళ్తున్నానని, ఆయన తిరిగి రాకుంటే తాను కూడా రాన’ని తన భార్యకు చెప్పి వెంటనే రూయీ బయల్దేరాడు. నాటివరకూ శిరిడీని వరించిన మహాభాగ్యం ఇప్పుడు విడిచి పెట్టిందేమోనని భయపడ్డాడు మహల్సాపతి. అయితేనేమి, తాను మాత్రం ఆ మహాత్ముని సేవను, సాన్నిధ్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోదల్చుకోలేదు.
మహల్సాపతి రూయీ గ్రామం చేరేసరికి ఆ గ్రామ ప్రవేశంలోనే వున్న మారుతి ఆలయం సమీపంలోని ఒక చెట్టుక్రింద బాబా కూర్చొని కనిపించారు. మహల్సాపతిని చూస్తూనే బాబా ఉగ్రులై, ‘తమ చెంతకు రావద్దని, తిరిగి పొమ్మ’ని కేకలేశారు. మహల్సాపతి తన నడక వేగం తగ్గించి ఆయనను సమీపించ యత్నిస్తుంటే, బాబా అతనిపై రాళ్ళు రువ్వసాగారు. చివరకు మహల్సాపతి బాబాతో, “బాబా! ఎన్నటికైనా నేను మీ భగత్‌నే. మీరు నన్ను చంపినా సరే, నేను మీ సన్నిధిని విడిచిపెట్టను. శిరిడీలో మిమ్మల్ని తిట్టినవారిని నేను దండిస్తాను. మీకు శిరిడీ రాకపోవడం ఇష్టంలేకపోతే నేను మీ దగ్గరే ఉండిపోతాను. నేనూ ఇక్కడే వుంటాను. మిమ్మల్ని విడిచిపోను. ఆ విషయం ఇంట్లోవారికి కూడా చెప్పి వచ్చాను!” అన్నాడు. మహల్సాపతి పట్టుదల చూచి బాబా రాళ్ళు రువ్వడం మానేశారుగానీ, అతనిని తన పాదాలనంటనివ్వలేదు. “నేనిక ఆ గ్రామానికి రాను. మేము ఫకీర్లం, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీవు సంసారివి. నీవు ఇల్లు విడిచి మావెంట రాగూడదు. నీవు తిరిగి ఇంటికి వెళ్ళు” అని నచ్చజెప్పారు. బాబా కంఠంలో ధ్వనించిన నిశ్చయం చూసి మహల్సాపతి నివ్వెరబోయాడు. చివరికి, బాబా తనతో పాటు శిరిడీకి రాకపోతే తాను అన్నము, నీళ్ళు ముట్టుకోనని ఆయన చెంతనే కూర్చున్నాడు. బాబా తిరిగి మహల్సాపతిని తిట్టిపోశారు, నచ్చచెప్పారు. కనీసం రూయీ గ్రామంలోకి వెళ్ళయినా భోజనం చేయమని చెప్పారు. వీరిద్దరి మధ్య సాయంత్రం వరకూ ఇదే కొనసాగింది. చివరికి భక్తుడి మాటే నెగ్గింది. బాబా, మహల్సాపతి ఇద్దరూ తిరిగి శిరిడీ చేరారు. మనందరికీ బాబా తిరిగి లభించారు. మనందరికీ శిరిడీ దర్శనం ప్రాప్తిస్తుందంటే అది మహల్సాపతి చలువే!
ఒకసారి శ్రీఅక్కల్కోటస్వామి శిష్యులైన శ్రీఆనందనాథ్ మహరాజ్ ఏవలా దగ్గరనున్న సవర్గాఁవ్లోని మఠంలో కొద్దిరోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. ఆ సమయంలో శిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే, నందూరామ్ మార్వాడీ మొదలైనవారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమవుతుంటే, అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వారి వద్దకు వచ్చి, “నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరూ?” అని చిన్నపిల్లవానిలా మారం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. శిరిడీ చేరిన శ్రీఆనందనాథస్వామి శ్రీసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన, శ్రీసాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారుగానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ తరువాత ఆయన బాబాను ఉద్దేశించి, “ఈయన ఎక్కడనుండి వచ్చారు? ఈయన మానవులలో చాలా ఉన్నతశ్రేణికి చెందిన రత్నం. ఇప్పుడీ చెత్తకుప్ప మీద ఉన్నా, ఈయన రాయి కాదు, నిజమైన రత్నం. ఇది నిజంగా శిరిడీవాసుల భాగ్యం. నా మాటలను గుర్తుంచుకోండి, ముందు ముందు మీకే అర్థమవుతుంది” అని అన్నారు.
మరోసారి, పుంతంబా సమీపంలో నివసించే శ్రీగంగగిర్ మహరాజ్ శిరిడీ వచ్చారు. ఆయన గొప్ప మహాత్ముడుగా ప్రఖ్యాతుడు. ఆయన గృహస్థుగా ఉంటూనే నిస్వార్థంగా వివిధ ప్రదేశాల్లో నామసప్తాహాలు, సత్సంగాలు నిర్వహిస్తుండేవారు. కాపూస్వాడ్గాం వద్ద నామసప్తాహం పూర్తిచేసి కొందరు శిరిడీ గ్రామస్థుల ఆహ్వానంపై శిరిడీ వచ్చి 7 రోజులపాటు భగవన్నామ సప్తాహం, సత్సంగం, హోమం, అన్నదానం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. దైవచింతన గల మహల్సాపతి తదితరులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సప్తాహం పూర్తయిన తరువాత అక్కడున్న వారందరికీ భోజన ప్రసాద వినియోగం జరుగుతోంది. ఆ సమయంలో శ్రీసాయిబాబా తమ రెండు చేతులతోనూ మట్టికుండలు పట్టుకొని మసీదువైపు వెళుతున్నారు. అక్కడే ఉన్న గంగగిర్ మహరాజ్ బాబాను చూచి, “ఈ మహరాజ్ ఎవరు?” అని ప్రక్కనే ఉన్న మహల్సాపతిని అడిగాడు. “ఆయన సాయి మహరాజ్!” అని సమాధానమిచ్చాడు మహల్సాపతి. “ఈయన గొప్ప రత్నం. ఈ అమూల్య రత్నాన్ని పొందిన శిరిడీ ప్రజలు ధన్యులు. ఈరోజు ఈయన భుజాన నీరు మోస్తున్నారు. కానీ ఈయన సామాన్యులు కాదు. మీకింకా ఆయన సంగతి తెలియలేదు. ఆయన్ను జాగ్రత్తగా సేవించుకోండి!” అంటూ బిరబిరా బాబా వెళ్తున్న వైపు నడిచారు శ్రీగంగగిర్. మహల్సాపతి తదితరులు ఆయన్ను అనుసరించారు. త్వరగా మసీదు చేరాలనే ఉద్దేశంతో హడావుడిగా అడ్డత్రోవన మసీదు చేరారు గంగగిర్ మహరాజ్. అప్పటికే మసీదు చేరిన బాబా తమ చేతిలో ఉన్న కుండలను క్రిందపెట్టి, ప్రక్కనే వున్న ఇటుకరాయిని చేతిలోకి తీసుకొని, మసీదు మెట్లు ఎక్కుతున్న గంగగిర్ మహరాజ్‌ను ఉద్దేశించి, “ఇలా కాదు, అట్లా వెళ్ళి ఇట్లా రా!” అని మసీదు ముందుండే బాటవైపు చూపారు. (బాబా లెండీకిగానీ మరెక్కడికిగానీ వెళుతున్నప్పుడు దూరమయినాసరే ప్రధాన రహదారి గుండానే వెళ్ళేవారు! దగ్గరదారి అని అడ్డత్రోవన ఎప్పుడూ నడిచేవారు కాదు.) వెంటనే శ్రీగంగగిర్ వెనక్కి వెళ్ళి, చుట్టూ తిరిగి మామూలు దారిలో మసీదు చేరారు. శ్రీగంగగిర్ దగ్గరకు రాగానే బాబా, “ఆవో, చాంగ్దేవ్ మహరాజ్!” అంటూ ఆయనను మసీదులోకి ఆహ్వానించారు. ఆ తరువాత బాబా, శ్రీగంగగిర్ మహరాజ్, మహల్సాపతి చిలిం త్రాగుతూ చాలాసేపు మాట్లాడుకున్నారు. (చాంగ్దేవ్ మహరాజ్ 13వ శతాబ్దంలో అత్యంత ప్రఖ్యాతుడైన గొప్ప హఠయోగి. శ్రీజ్ఞానేశ్వర్ మహరాజ్ దర్శనంతో ఆయనకున్న యోగశక్తుల వ్యామోహం, జ్ఞానగర్వం పటాపంచలవుతుంది. శ్రీజ్ఞానదేవులు ఆ యోగికి చేసిన బోధ ‘చాంగ్దేవ్ ప్రశస్తి’ పేరున ప్రఖ్యాతం. బాబా శ్రీగంగగిర్ మహరాజ్‌ను చాంగ్దేవ్గా ఎందుకు సంబోధించారో ఆ సద్గురుమూర్తికే ఎఱుక!)
ఇలా మహాత్ములు సైతం సాయిబాబాను కీర్తిస్తుండటంతో బాబా సామాన్య సత్పురుషులుకారని గుర్తించిన మహల్సాపతి, అతని మిత్రులు బాబానే తమకు తగిన గురువని భావించారు. వారిలో మహల్సాపతి బాబాను దైవంగా పూజించనారంభించాడు. ఒకరోజు మహల్సాపతి చందనం, పువ్వులు, పాలు తీసుకొని మసీదుకు వెళ్లి, బాబా పాదాలకు పువ్వులు సమర్పించి, వారి పాదాలకు, కంఠానికి చందనమద్ది, బాబాకు పాలను నివేదించాడు. ఆ రోజులలో బాబా తమను పూజించేందుకు ఎవరినీ అనుమతించేవారు కాదు. కానీ మహల్సాపతిలోని తీవ్రమైన భక్తి, ప్రేమలకు కరిగిపోయి అతని పూజకు బాబా అభ్యంతరం చెప్పలేదు. ఇక అప్పటినుండి ప్రతిరోజూ ఆవిధంగానే బాబాను ఆరాధించనారభించాడతను. తరువాత ఒకసారి మహల్సాపతికి బాబా స్వప్నదర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో బాబా నుదుటికి, రెండు చేతులకి గంధం పూయబడి ఉండటం గమనించాడు మహల్సాపతి. మరుసటిరోజు అతను మసీదుకొచ్చి బాబా నుదుటికి, చేతులకి గంధమద్ది పూజించాడు. అందుకు బాబా అడ్డు చెప్పలేదు. అప్పటినుండి మహల్సాపతి ప్రతినిత్యమూ ఆవిధంగానే బాబాను పూజిస్తూ ఉండేవాడు. అది ముస్లిం మతస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మసీదులో హిందూ పద్ధతిననుసరించి బాబాను పూజించడం వాళ్లకు అపచారమనిపించింది. ఈ విషయంపై వాళ్ళు బాబాకు ఫిర్యాదు చేసినా బాబా ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో వారంతా మహల్సాపతిని దండించదలచి సంగమనేరు నుండి ఖాజీని(ముస్లిం మతపెద్ద) తీసుకొచ్చారు. అది తెలిసి మహల్సాపతి భయపడి తన అలవాటు ప్రకారం ఖండోబా, శని, మారుతి మరియు గణపతిలను పూజించి, ఆపై బాబాను పూజించకుండా వెళ్లిపోదలచి మసీదు ముందునుండి వెళ్ళిపోతున్నాడు. ఇంతలో బాబా అతనిని ఆపి, “అరే భగత్, నన్ను పూజించకుండా బయటనుండే వెళ్ళిపోతున్నావెందుకు?” అని అడిగారు. అందుకతను, “బాబా! నేను మిమ్మల్ని పూజించటం ఖాజీసాహెబ్కు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. అందుకే మిమ్మల్ని పూజించకుండానే వెళ్ళిపోతున్నాను” అని అన్నాడు. అప్పుడు బాబా తమ నుదుటిని, కంఠాన్ని, చేతులను చూపిస్తూ కోపావేశంతో, “ఇక్కడ, ఇక్కడ చందనమద్ది పూజించుకో! నిన్నెవరడ్డగిస్తారో చూస్తాను” అని అన్నారు. బాబా మాటలతో మహల్సాపతికి ధైర్యం చేకూరి మసీదు లోపలికి వెళ్లి ఎప్పటిలాగే బాబాను పూజించాడు. అదంతా చూస్తున్న ఆ ఖాజీ అక్కడినుండి వెళ్ళిపోయాడు. అప్పటినుండి మహల్సాపతి బాబాను యధేచ్చగా పూజించుకోసాగాడు. మహల్సాపతి తమను పూజించడానికి బాబా అనుమతించినప్పటికీ, నానాసాహెబ్ డేంగ్లే వంటి స్థానికులు ఎంతగా ప్రాధేయపడినా వాళ్ళు తమను పూజించడానికి మాత్రం బాబా అనుమతించేవారు కాదు. బాబా వాళ్లతో, “మసీదులో ఉన్న స్తంభాన్ని పూజించుకో”మని మాత్రమే అనేవారు. అయితే, వాళ్ళు అలా చేయలేదు. తరువాత బాబాకు స్థిరమైన అనుచరుడైన దగడూభావ్ మధ్యవర్తిత్వంతో నానాసాహెబ్ డేంగ్లే బాబాను పూజించేందుకు అనుమతి పొందాడు. ఆ తరువాత బాబాను పూజించుకునే భాగ్యం నూల్కర్కు, మేఘకు, బాపూసాహెబ్ జోగ్‌కు దక్కింది. అంతకుమునుపు ఒకసారి నానాసాహెబ్ చాందోర్కర్ కొడుకైన నాలుగు సంవత్సరాల బాపును తమకి చందనమద్దమని అడిగి పెట్టించుకున్నారు బాబా. అలా క్రమంగా బాబాను పూజించేందుకు అందరికీ అనుమతి లభించి వారిని పూజించడం సాంప్రదాయమైంది. ఏదేమైనా సాయిపూజకు అంకురార్పణ చేసిన అదృష్టం మాత్రం మహల్సాపతికే దక్కింది. బాబా మహాసమాధి చెందేవరకు ప్రతినిత్యమూ ఎంతో శ్రద్ధాభక్తులతో బాబాను పూజించేవాడు మహల్సాపతి. ప్రతిరోజూ అతని ఇంటినుండి బాబాకు నైవేద్యం వచ్చేది. అలాగే బాబా ఆదేశం మేరకు సాఠేసాహెబ్, బాలాసాహెబ్ భాటేల ఇళ్ళవద్దనుండి కూడా నైవేద్యాన్ని మసీదుకు తీసుకొని వచ్చేవాడు మహల్సాపతి.
1896లో జన్మాష్టమినాడు బాబా మహల్సాపతితో, “అరే భగత్, ఈ ఫకీరు మాటలు విను, అవి ఎల్లప్పుడూ సత్యాలు. నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావుగానీ నీ భార్యతో ఉండట్లేదు. నీకు కూతుర్లు మాత్రమే ఉన్నారు. కూతుళ్లు చింతపండులాంటివాళ్ళు; కొడుకులు మామిడిపండువంటివాళ్ళు. వెళ్లి, ఇంట్లో పడుకో! నీకు ఒక కొడుకు పుడతాడు” అని ఒత్తిడి చేసినప్పటికీ కుటుంబాన్ని పెంచుకోవడంలో ఎంత మాత్రమూ ఆసక్తి లేని మహల్సాపతి ఇంటికి వెళ్ళడానికి నిరాకరించాడు. అప్పుడు బాబా అక్కడే ఉన్న కాశీరాంషింపీ, తాత్యాకోతేపాటిల్, లక్ష్మీబాయిషిండే తదితరులతో, “భగత్ మరీ పిచ్చివాడైపోతున్నాడు. అతన్ని సంసారం చెయ్యమనాలె!” అని అన్నారు. బాబా మాటపై మహల్సాపతి మిత్రుడైన కాశీరాంషింపీ బలవంతంగా అతనిని ఇంటికి తీసుకొని వెళ్లి, ఇంట్లో విడిచిపెట్టాడు. ఆరోజు నుండి మహల్సాపతి ఇంట్లో నిద్రించడం మొదలుపెట్టాడు. మరుసటి సంవత్సరం(1897) జన్మాష్టమినాడు బాబా ఆశీస్సులతో అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. మహల్సాపతి ఆ బిడ్డను బాబాకు చూపించి, బిడ్డను ఆశీర్వదించి ఏ పేరు పెట్టాలో తెలియజేయమని అడిగాడు. బాబా ఆ బిడ్డకి ‘మార్తాండ్’ అని నామకరణం చేయమని చెప్పి, “ఈ బిడ్డని 25 ఏళ్ళ వరకు చూసుకో, సరిపోతుంది” అని అన్నారు. 25 సంఖ్య తన ఆయుఃప్రమాణాన్నే సూచిస్తుందని ఆ సమయంలో మహల్సాపతికి అర్థంకాక ఎంతో వినయంగా, “బాబా! బిడ్డను చూసుకోవడం నా శక్తికి మించినది. అది మీ చేతుల్లోనే ఉంది” అని అన్నాడు. అందుకు బాబా, “నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి” అని అన్నారు. మహల్సాపతి శరణాగతి చెందిన భక్తుడైనప్పటికీ అహాన్ని విడిచిపెట్టలేదు, శరీరం ద్వారా జరిగే చర్యలన్నీ భగవంతుని చర్యలుగా పరిగణించే స్థాయికి ఎదగలేదు. అయితే బాబా ఇటువంటి పలు సందర్భాల ద్వారా ఆ స్థాయికి పరిణతి చెందేలా మహల్సాపతికి మార్గనిర్దేశం చేస్తుండేవారు.
(బహుశా మహల్సాపతి తన ఇంట నిదురించిన ఆ సంవత్సర కాలంలోనే) ఒకసారి బాబా కటికనేలపై నిద్రించటం చూసి సహించలేని నానాసాహెబ్ డేంగ్లే నాలుగు మూరల పొడవు, జానెడు వెడల్పు గల ఒక చెక్కబల్లను బాబాకు సమర్పించాడు. బాబా ఆ చెక్కబల్లను సన్నని గుడ్డపీలికలతో మసీదు పైకప్పు నుండి మూరెడు క్రిందకు ఉయ్యాలలా వ్రేలాడదీశారు. రాత్రిపూట దానికి నాలుగు మూలలా వెలుగుతున్న ప్రమిదల్ని ఉంచి వాటిమధ్య పడుకునేవారు. ఆ బల్లనే మోస్తాయో లేదోనన్పించే ఆ గుడ్డపీలికలు బాబాను కూడా మోయడమే చిత్రం! అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. నిచ్చెన సహాయం లేకుండా బాబా ఆ బల్లమీదకు ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో ఎవరికీ తెలిసేది కాదు. అంతవరకు క్రిందనే ఉన్న బాబా అంతలోనే దానిపై పడుకొని కన్పించేవారు. అలాగే దిగేవారు. అది చూడడానికి జనం విరగబడుతుంటే బాబా ఒకరోజు ఆ చెక్కబల్లను విరిచి ధునిలో వేశారు. చాలా సంవత్సరాల తరువాత ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ బాబాతో, “బాబా, మీరు నిద్రించడానికి నేను ఒక చెక్కబల్లను తీసుకువస్తాను. మీరు మునుపటిలా దానిపై నిద్రించవచ్చు” అన్నాడు. అప్పుడు బాబా, “వద్దు. మహల్సాపతిని క్రింద విడిచి నేను దానిపై ఎలా నిద్రపోగలను?” అని అన్నారు. “మీరు కోరితే, నేను అతని కోసం మరొక చెక్కబల్లను ఏర్పాటు చేస్తాను” అని అన్నాడు దీక్షిత్. బాబా నవ్వి, “అతను చెక్కబల్లపై నిద్రించగలడా? అది అంత సులభం కాదు. నేను అతనితో, ‘నువ్వు నా హృదయంపై నీ చేయి ఉంచి, నా హృదయంలో నామస్మరణ ఎలా జరుగుతుందో గమనించు. నేను నిద్రపోతున్నానని నీకు అనిపిస్తే, నన్ను మేల్కొలుపు!‘ అని చెప్తాను. కానీ, అతను అది కూడా చేయలేకపోతున్నాడు. అతను కూర్చొని కునికిపాట్లు పడుతుంటాడు. అతనికి నిద్ర తూగినపుడు అతని చేయి నా గుండెపై ఒక బండరాయిలా బరువుగా అనిపిస్తుంది. అప్పుడు నేనతణ్ణి గట్టిగా పిలిచి లేపితే కంగారుగా కళ్ళు తెరుస్తాడు. నేలపైనే సరిగ్గా కూర్చోలేనివాడు, నిద్రకు బానిసైనవాడు వ్రేలాడే చెక్కబల్లపై ఎలా పడుకోగలడు? కాబట్టి, నాకు ఇలా నేలమీదే బాగుంది” అని అన్నారు.
ఇకపోతే, పుత్రుడు జన్మించిన తరువాత మహల్సాపతి తిరిగి మునుపటిలా రాత్రిళ్ళు బాబా సాంగత్యంలో నిద్రించనారంభించాడు. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే మహల్సాపతి తన వస్త్రాన్ని మసీదులో నేలపై పరిచాడు. ఆ వస్త్రంపై ఒకవైపు బాబా, మరోవైపు మహల్సాపతి పడుకున్నారు. కాసేపటికి బాబా అతనితో, “భగత్! నేను చెప్పేది విను. ఈరోజు మనం అత్యంత జాగరూకతతో ఉండాలి. ఆ మొరటువాడైన రోహిల్లా (ప్లేగు) నిగోజ్ పాటిల్ భార్యను తీసుకుపోవాలని చూస్తున్నాడు. నామస్మరణ ద్వారా నేను ఆ అనర్థం జరగకుండా చూడమని అల్లాను ప్రార్థిస్తాను. ఎవరూ రాకుండా, నేను చేసే నామస్మరణకు అంతరాయం కలగకుండా నువ్వు చూడు” అని చెప్పారు. బాబా ఆదేశం మేరకు మహల్సాపతి మేలుకొని వారి నామస్మరణకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు అర్థరాత్రి దాటాక నెవాసా నుండి ఆ గ్రామ మామల్తదారు, అతని సహచరులు ఎలాగైనా బాబా దర్శనం చేసుకోవాలని అక్కడికి వచ్చారు. వాళ్లతో వచ్చిన జవాను మహల్సాపతి ఎంత చెప్పినా వినకుండా తమకప్పుడే బాబా దర్శనం, ఊదీ కావాలని బలవంతం చేయసాగాడు. వాళ్ళను నిలువరించడానికి మహల్సాపతి ఎంతగానో ప్రయత్నించాడుగానీ అధికార మదాన్ని ఎవరు అడ్డుకోగలరు? చివరికెలాగో అతి కష్టం మీద కొంత ఊదీ తీసుకొని వెళ్ళమని వాళ్ళను ఒప్పించి, ఊదీ తీసుకోవడానికి ధుని వద్దకు వచ్చాడు మహల్సాపతి. వాళ్ళ మాటల శబ్దానికి, మహల్సాపతి అడుగుల సవ్వడికి బాబాకు ధ్యానభంగమైంది. బాబా కోపోద్రిక్తులై, “అరే భగత్, నీకూ ఒక కుటుంబం ఉంది! నిగోజ్ ఇంట ఏమి జరుగుతుందో నీకు తెలియదా? ఈ అంతరాయం వలన నా ప్రయత్నం విఫలమైంది. పాటిల్ భార్య మరణించింది” అని శాపనార్థాలు పెడుతూ పడుకోవడానికి పరచిన వస్త్రాన్ని తీసి మహల్సాపతిపై విసిరికొట్టారు. మరుక్షణమే ఆయన శాంతించి, “సరే, జరిగిందేదో మంచికే జరిగింది” అని అన్నారు.
రానురానూ మహల్సాపతి తన సమయమంతా బాబా చెంతనే గడుపుతుండేవాడు. భోజనానికి, ఇంకా ముఖ్యమైన పనులేమైనా ఉంటే తప్ప అతను ఇంటికి వెళ్ళేవాడు కాదు. అతనలా వెళ్ళిన కాసేపటికే బాబా అతనిని పిలుచుకు రమ్మని ఒకరిద్దరిని పంపుతుండేవారు. అంతలా వారివురి మధ్య అనుబంధం ఉండేది. మహల్సాపతి శ్రీసాయిని ఎంతగానో సేవించేవాడు. ఆయన పాదాలొత్తేవాడు. చిలిం వెలిగించడం, బాబా శయనించేందుకు పడకను సిద్ధం చేయడం వంటి కొన్ని ప్రత్యేకమైన సేవలు మహల్సాపతి మాత్రమే చేసేవాడు. ప్రతిరోజూ రాత్రి భోజనాలయ్యాక బాబా సేవకుడైన మాధవ్‌ఫస్లే బాబా వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకను, ఒక చింకిగుడ్డను మహల్సాపతికి అందించేవాడు. బాబా తలపెట్టుకొనేవైపు ఆ ఇటుకను ఉంచి, దానిపై ఆ పాతగుడ్డను ఉంచి, ఆపై దుప్పటి పరచి బాబాకు పడక అమర్చేవాడు మహల్సాపతి. బాబా ఆ ఇటుకపైనే తలపెట్టుకొని నిద్రపోయేవారు. కొంతసేపటి తర్వాత మహల్సాపతి లేచి, ప్రమిదలలో నూనె నింపి, వత్తులు సవరించి, బాబా రొట్టెలు పెట్టుకొనే కుండమీద మూతపెట్టి, ధునిలో కట్టెలు వేసేవాడు.
ఒకరోజు శిరిడీలో కుంభవృష్టి కురిసి మసీదంతా తడిసిపోయి, బాబాకు కూర్చునేందుకు కూడా చోటు లేకపోయింది. భక్తులంతా బాబాను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. బాబా అంగీకరించకపోయేసరికి సాయిభక్తుడైన నారాయణతేలి బాబాను ఎత్తుకొని బలవంతంగా తీసుకొని వెళ్లి చావడిలో కూర్చోబెట్టాడు. నాటి రాత్రి బాబా చావడిలోనే విశ్రమించారు. ఆనాటినుండి బాబా ఒకరాత్రి మసీదులో, ఒకరాత్రి చావడిలో నిద్రించనారంభించారు. మహల్సాపతి కూడా బాబాతోపాటే మసీదులోనూ, చావడిలోనూ నిద్రించేవాడు. వారివురి మధ్య అనుబంధం వింతగానూ, చమత్కారంగానూ ఉండేది. ఏకాంత పరిసరాలలో చిలిం త్రాగుతూ వారివురి మధ్య జరిగే సంభాషణ మరింత ఆసక్తికరంగా ఉండేది. ఈ విషయానికి సంబంధించి శ్రీమతి కాశీబాయి కనీత్కర్ 1906లో తమకు జరిగిన అనుభవం గురించి ఇలా చెప్పింది: “బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవారు. మేము శిరిడీలో ఉన్న రోజు బాబా తమ అలవాటు ప్రకారం మహల్సాపతితో కలిసి మసీదు నుండి చావడికి వచ్చారు. వారిరువురు చావడి ప్రవేశద్వారం వద్ద చీకటిలో కూర్చున్నారు. నా భర్త గోవిందరావు కనీత్కర్ కూడా వెళ్లి అక్కడ కూర్చున్నారు. బాబా, మహల్సాపతిల మధ్య చక్కటి ఆహ్లాదకరమైన సంభాషణ జరుగుతుండగా బాబా చిలిం వెలిగించి, తాము పీల్చి మహల్సాపతికి అందించారు. తరువాత నా భర్తకి కూడా ఇచ్చారు. తరువాత కూడా బాబా, మహల్సాపతిల మధ్య సంభాషణ కొనసాగింది. బాబా మాటల మధ్యలో అప్పుడప్పుడు మహల్సాపతిని, “అంతేకదా భగత్?” అని అడుగుతుండేవారు. అందుకతను పదేపదే “బేషక్, బేషక్” (నిస్సందేహంగా, నిస్సందేహంగా) అని ఒకే పదాన్ని రెండుసార్లు అంటుండేవాడు. అయితే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మూడో వ్యక్తి గ్రహించలేకపోయేవారు. అంతలో చిలిం మరోసారి వెలిగించాల్సి వచ్చింది. కానీ చిలిం గొట్టంలో ఉండే చిన్నరాయి ఎక్కడో పడిపోయింది. దాంతో బాబా ఆగ్రహించి తీవ్రంగా తిట్టిపోయసాగారు ….”
సహజంగానే ప్రాపంచిక విషయాలపట్ల అనురక్తిలేని మహల్సాపతి ఎటువంటి కోరికలూ లేక అతి నిరాడంబరమైన జీవితాన్ని సాగిస్తుండేవాడు. బాబా కూడా అతన్ని అలానే ఉండనిచ్చారు. మహల్సాపతి ఆర్థికంగా నిరుపేదవాడైనప్పటికీ జీవనోపాధికి అవసరమయ్యే ధనసంపాదన కోసం తన సమయాన్ని ఏ మాత్రమూ వెచ్చించక పూర్తి సమయాన్ని బాబా సేవలోనే గడిపేవాడు. బాబా సేవలోనే అతను అమితమైన ఆనందాన్ని పొందుతుండేవాడు. అతనికి బాబాపట్ల ఎనలేని భక్తిప్రపత్తులుండేవి. అందుకే బాబా అతనిని చాలా ఇష్టపడేవారు. అతని ప్రభావం బాబాపై చాలా ఉండేది. ఇంకెవరు చెప్పినా విన్పించుకోని సందర్భాలలో సైతం మహల్సాపతి చెబితే బాబా వినేవారు. బాబా నివాసముండే మసీదు చాలా పురాతనమైనది, శిథిలావస్థలో ఉండేది. దానిని పునర్నిర్మించాలని నానాసాహెబ్ చందోర్కర్ సంకల్పించి బాబా అనుమతిని అర్థించాడు. కానీ బాబా మొదట అందుకు ఒప్పుకోలేదు. బాబా అనుమతి కోసం వేచివున్న సమయంలో ఒకరోజు చందోర్కర్ మసీదు బయట ఉండగా మహల్సాపతి మసీదుకి వచ్చాడు. బాబా అతన్ని తమ దగ్గరకు పిలిచి, “భగత్, బయట నిలుచున్న ఆ వ్యక్తి ఎవరు?” అని అడిగారు. అందుకు మహల్సాపతి, “అతను నానాసాహెబ్” అని బదులిచ్చి, చిలిం వెలిగించి బాబాకు అందించాడు. అప్పుడు బాబా, “అరే భగత్, నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. బయట నిలబడివున్న ఈ నానా మసీదును క్రొత్తగా పునర్మిస్తానని అంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? మనం క్రొత్త మసీదు నిర్మించాలా? లేక మనకు ఈ పాత భవనం సరిపోతుందా? అసలు క్రొత్తది ఎందుకు నిర్మించాలి?” అని అడిగారు. అందుకు మహల్సాపతి సౌమ్యంగా పరిహాసమాడుతూ, “అతన్ని క్రొత్తది నిర్మించనివ్వండి. అది మనిద్దరికీ కూర్చోవడానికి, పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది” అని అన్నాడు. ఈ విధంగా చిలిం త్రాగుతూ వారివురి మధ్య సంభాషణ జరిగాక బాబా మసీదు పునరుద్ధరించడానికి అనుమతిని ఇచ్చారు. తరువాత బాబా ఆదేశం మేరకు మహల్సాపతి నానాను పిలిచి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించాడు.
ధనప్రలోభానికి లోనుకాని సాయిభక్తుడు:
ఆధ్యాత్మికోన్నతి విషయంలో ఇతర భక్తులకు బాబా యొక్క మద్దతు, అభయం అవసరమయ్యేవి. కానీ మహల్సాపతి విషయంలో వాటి ఆవశ్యకత లేకపోయేది. ఎందుకంటే, అతను అప్పటికే తనకున్న పరిస్థితుల్లో సాధ్యమైనంతవరకు నైతికతను, మనోపవిత్రతను, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అతను ఇంద్రియాలపై గొప్ప నియంత్రణను కలిగివుండేవాడు. కోరికలను, అవసరాలను అదుపులో ఉంచుకునేవాడు. అతనిలో గుర్తించదగ్గ గొప్ప విషయమేమిటంటే, మహల్సాపతి తన కుటుంబ పోషణ కోసం భిక్షావృత్తిపైనే ఆధారపడినప్పటికీ ఇతరులిచ్చిన ధనాన్ని గానీ, వస్తువులను గానీ స్వీకరించేవాడు కాదు. ఆధ్యాత్మిక సాధనలో ఈ ‘అపరిగ్రహ’ నియమాన్ని ఉత్తమ నియమంగా కీర్తిస్తారు. మహల్సాపతి మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం ఆశ్చర్యం! ఆ అపరిగ్రహ నియమాన్ని ఖచ్చితంగా పాటించే క్రమంలో ఒక్కోసారి మహల్సాపతి, అతని కుటుంబం పక్షం రోజులపాటు తినడానికేమీ లేక పస్తులుండాల్సి వచ్చేది. అయినా మహల్సాపతి తన అపరిగ్రహ నియమాన్ని తప్పేవాడు కాదు. ఇతరుల నుండి ధనాన్ని, కానుకలను స్వీకరించడం వలన నిలకడగా అత్యంత జాగరూకతతో సద్గ్రంథ పఠనం మొదలైనవాటివల్ల సంపాదించుకున్న పుణ్యం హరించుకుపోతుందనీ లేదా ఆ పుణ్యంలో కొంతైనా ఆ కానుకలిచ్చే దాతల పరమవుతుందనీ అతను నమ్మేవాడు. అంతేకాదు, తాను పొందాలనుకునే ఉన్నత స్థితిని చేరడానికి అది అవరోధమని కూడా అతను విశ్వసించేవాడు. కాబట్టి తానూ, తన కుటుంబం పస్తులున్నాసరే భిక్ష ద్వారా లభించే ఆహారాన్ని మినహాయిస్తే ఇతరులు ఇచ్చే కానుకలను నిష్కర్షగా తిరస్కరించేవాడు. ఒకసారి చింతామణ్రావు అనే భక్తుడు 1,000 రూపాయలు, మరోసారి యం.ఏ సేఠ్ అనే భక్తుడు 100 రూపాయలు, ఇలా మరెందరో సాయిభక్తులు ఎంతో డబ్బు మహల్సాపతికిచ్చి స్వీకరించమని ఒత్తిడి చేసినప్పటికీ ఆ కానుకలను స్వీకరించడానికి అతను సుతరామూ ఒప్పుకోనేవాడు కాదు. బాబా కూడా అతనెప్పుడూ ధనప్రలోభానికి లోనుకాకుండా చూసేవారు. 1917లో ప్రముఖ వ్యాపారవేత్త హంసరాజ్ ఆస్తమాతో బాధపడుతూ తన భార్యతో సహా శిరిడీ వచ్చి, బాబాను దర్శించి, వారి ఆదేశం మేరకు రెండు మూడు నెలలు శిరిడీలో ఉన్నాడు. అతను మహల్సాపతి పేదరికాన్ని చూసి చలించిపోయి పదిరూపాయలు అతనికివ్వబోయాడు. కానీ మహల్సాపతి ఆ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. దాంతో హంసరాజ్ ఆ డబ్బును కాకాసాహెబ్ దీక్షిత్కిచ్చి, బాబా సమక్షంలో మహల్సాపతికిమ్మని కోరాడు. మహల్సాపతి బాబాను పూజిస్తున్న సమయం చూసుకొని దీక్షిత్ ఆ మొత్తాన్ని మహల్సాపతికి ఇవ్వబోయాడు. కానీ ఆ మొత్తాన్ని తీసుకునేందుకు మహల్సాపతి ఒప్పుకోలేదు. అప్పుడు దీక్షిత్ బాబాతో, “బాబా! దయచేసి ఈ మొత్తాన్ని తీసుకోమని మహల్సాపతితో మీరైనా చెప్పండి, లేదా మీరే ఈ మొత్తాన్ని తీసుకొని అతనికి ఇవ్వండి” అని అన్నాడు. అందుకు బాబా, “ప్రస్తుతానికి ఆ డబ్బులు నీ దగ్గరే ఉండనివ్వు” అని అన్నారు. కొంతసేపటికి మహల్సాపతి బాబా పూజ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా దీక్షిత్‌ను, “ఎన్ని రూపాయలవి?” అని అడిగారు. అందుకతను, “పది రూపాయల”ని బదులిచ్చాడు. బాబా “ఆ మొత్తాన్ని తమ దిండుపై ఉంచమ”ని చెప్పి, నానాసాహెబ్ నిమోన్కర్తో, “ఈ మొత్తాన్ని అందరికీ పంచిపెట్టు” అన్నారు. ఆ విధంగా ఆ మొత్తం నుండి మహల్సాపతికి పైసా కూడా చేరలేదు.
కానీ, అంతటి భక్తుడు, అతని కుటుంబం ఆకలితో అలమటిస్తుంటే బాబా చూస్తూ ఊరుకుంటారా? పరిస్థితి విషమించినప్పుడు ఆయన తన భక్తుని అపరిగ్రహ నియమాన్ని సడలింపజేసేవారు. ఒకసారి కొన్నిరోజులపాటు పస్తులుండటం వలన మహల్సాపతి కుటుంబం ప్రమాదంలో ఉందని గ్రహించిన కాకాసాహెబ్ దీక్షిత్ మహల్సాపతికి పదిరూపాయలు పంపాలనుకున్నాడు. అయితే మహల్సాపతి తన నియమానుసారం ఆ డబ్బును తిరస్కరిస్తాడని సంశయించి, అలా జరగకూడదని భావించి, ఆ పదిరూపాయలను ఒక కవరులో పెట్టి, దాన్ని తీసుకొని బాబా వద్దకు వెళ్లి, “బాబా! ఇది పంపనా?” అని అడిగాడు. అంతర్‌జ్ఞాని అయిన బాబా ‘ఎవరికి, ఏమిటి’ అనైనా అడగకుండా “పంపించు” అన్నారు. బాబా ఆదేశానుసారం దీక్షిత్ ఆ డబ్బును మహల్సాపతికి పంపాడు. నిజానికి దీక్షిత్ బాబా వద్దకు రావడానికి కొన్ని గంటల ముందు మహల్సాపతి భార్య బాబా దర్శనానికి వచ్చింది. అప్పుడు బాబా ఆమెతో, “అమ్మా! ‘బాబా ఇంటికి వస్తున్నారు, తిరస్కరించవద్దు‘ అని నీ భర్తతో చెప్పు” అని అన్నారు. తరువాత కొంతసేపటికి దీక్షిత్ తనకు పంపిన కవరుని చూడగానే, బాబా చెప్పింది దానిగురించేనని మహల్సాపతి గ్రహించి, తన నియమాన్ని ప్రక్కన పెట్టి ఆ ధనాన్ని స్వీకరించాడు. అంతేకాదు, బాబా ఎన్నోసార్లు తామిచ్చే ధనాన్ని స్వీకరించమని మహల్సాపతిని ఒత్తిడి చేసేవారు. 1880 తరువాత బాబాకు దక్షిణ రూపంలో రోజూ అధిక మొత్తంలో ధనం వస్తుండేది. బాబా ఆ మొత్తం నుండి ఒకరికి 50, మరొకరికి 30, ఇంకొకరికి 4 రూపాయల చొప్పున భక్తులకు పంచేస్తూ ఉండేవారు. బాబా మహల్సాపతితో చాలాసార్లు, “ఇదిగో, ఈ మూడు రూపాయలు తీసుకో! ఇలా రోజూ తీసుకుంటూ ఉండు” అని అనేవారు. బాబా అలా చెప్పిన ప్రతిసారీ మహల్సాపతి నిరాకరిస్తుండేవాడు. అయినప్పటికీ, “నేనిచ్చే మూడు రూపాయలు తీసుకుంటూ ఉండు. నేను నిన్ను శ్రీమంతుణ్ణి చేస్తాను. నీ జీవితాన్ని సుఖమయం చేసుకో! ఇతరులు సహాయం కోసం నిన్ను ఆశ్రయిస్తారు, నీపై ఆధారపడతారు” అని బాబా అంటుండేవారు. కానీ మహల్సాపతి మాత్రం ధనప్రలోభానికి లోనుకాకుండా ఎంతో స్థిరంగా, “బాబా! నాకివేమీ అక్కర్లేదు. నిరంతరం మీ పాదాలను పూజించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి, అది చాలు” అని అనేవాడు. ఎందుకంటే, బాబా సాంగత్యంలో తాను పొందే గొప్ప సంతృప్తి కంటే భౌతిక సంపదలు విలువైనవి కావని మహల్సాపతికి బాగా తెలుసు. మహల్సాపతి ఎన్నడూ మంచం మీద నిద్రించేవాడు కాదు. అవి అందుబాటులో ఉన్నా, లేదా ఎవరైనా సమకూర్చినా అతను మాత్రం సుఖాలను పట్టించుకునేవాడు కాదు. హేమాడ్‌పంత్ తాను రచించిన శ్రీసాయిసచ్చరిత్రలో మహల్సాపతి గురించి, ‘అతను ధనాన్ని ఆశించే భక్తుడు కాదు, అతను పరమార్థాన్ని కాంక్షించే గొప్ప భక్తుడు. అతను నిస్వార్థ ప్రేమమయ భక్తుడు. అతను తన దేహాన్ని, ఆత్మను బాబా పాదాలకు సమర్పించాడు’ అని వ్రాశాడు.
బాబా వర్తమానంలో ఎక్కడో సుదూర ప్రాంతాలలో జరిగేది తెలుసుకోగలిగే తమ దివ్యదృష్టిని, భవిష్యత్ జ్ఞానాన్ని, వ్యక్తుల మనస్సులపైన, పదార్థాలపైన (మానవ శరీరాలతో సహా) తమకు గల నియంత్రణను భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగించేవారు. ఆయన తమ భక్తులు దగ్గరగా ఉన్నా, ఎక్కడో దూరంగా ఉన్నా ప్రతిక్షణం వారి క్షేమాన్ని గమనిస్తూ, అవసరమైతే వారిని హెచ్చరించి వాళ్ళకొచ్చిన కష్టాల నుండి బయటపడేస్తుండేవారు. తమను అనన్యంగా ప్రేమించే భక్తులపై అప్రమత్తతో కూడుకున్న వారి అనుగ్రహదృష్టి ఎల్లప్పుడూ ఉండేది. మహల్సాపతిపై ఉన్న ఆ విధమైన వారి అనుగ్రహదృష్టి అతని ఆకలి కష్టాలను తీర్చింది(ఆ విషయం గురించి ఇదివరకు తెలుసుకున్నాం), రానున్న ఆపదలను తప్పించింది, అవసరంలో ధైర్యాన్నిచ్చింది.
ప్రతిరోజూ రాత్రి మహల్సాపతి భోజనానికి ఇంటికి వెళ్లేముందు బాబాను సెలవు అడిగేవాడు. అప్పుడు బాబా, “వెళ్ళు, నేను నీతోనే ఉన్నాను” అని చెప్పడం ద్వారా “నేను నీకు రక్షణనిస్తాను” అని చెప్పకనే చెప్పేవారు. బాబా భౌతికంగా అతనితో లేకపోయినా అదృశ్యరూపంలో అతనిని సంరక్షిస్తుండేవారు. అతనికెప్పుడూ ఏ హానీ జరగలేదు.
ఆరోజుల్లో శిరిడీలో పాముల సంచారం ఎక్కువగా ఉండేది. ఒకరోజు సాయంత్రం మహల్సాపతి మసీదు నుండి బయలుదేరుతుండగా బాబా అతనితో, “దారిలో ఇద్దరు దొంగలు (బాబా పాములను ‘దొంగలు’ అనీ, ‘ఆ పొడుగాటి మనిషి’ అనీ అనేవారు) ఎదురుపడే అవకాశముంద”ని చెప్పారు. బాబా చెప్పినట్లే, మహల్సాపతికి తన ఇంటి గుమ్మం వద్ద ఒక పాము, పొరుగింటి వద్ద మరో పాము కనిపించాయి. మరొకరోజు బాబా అతనితో, “నువ్వు తిరిగి వచ్చేటపుడు నీతోపాటు ఒక లాంతరు తెచ్చుకో. మసీదు గేటు వద్ద నీకొక దొంగ ఎదురవుతాడు!” అని అన్నారు. బాబా ఆదేశం మేరకు మహల్సాపతి చేతిలో లాంతరు పట్టుకొని వస్తుంటే మసీదు గేటు వద్ద ఒక పాము కనిపించింది. అతను, ‘పాము, పాము’ అని పెద్దగా అరవడంతో చుట్టుప్రక్కలవాళ్ళు వచ్చి దాన్ని చంపేశారు.
ఒకసారి బాబా మహల్సాపతితో మామూలుగా మాట్లాడుతూ, “నువ్వు వెన్ను నేలకు ఆనించి పడుకోవద్దు!” అని హెచ్చరించారు. అతను ఆ నియమాన్ని కొన్నిరోజులు శ్రద్ధగానే పాటించాడు. అయితే, ఒకరోజు భోజనం తరువాత కాస్త అసౌకర్యంగా అనిపించడంతో అలాగే నేలపై కూర్చున్నాడు. కొద్దిసేపటికి నిద్రతూగి వెన్నును నేలకు ఆనించి నిద్రపోయాడు. అతనికి పిచ్చి పిచ్చి కలలొచ్చి, నిద్రలో కలవరించసాగాడు. కొంతసేపటికి అతనికి మెలకువ వచ్చింది. లేచి కూర్చొని కాళ్ళు మడుచుకుందామంటే సాధ్యం కాలేదు. కూతుళ్ళు వచ్చి అతని కాళ్ళు మర్దన చేశాకగానీ అతను లేచి నడవలేకపోయాడు. తరువాత అతను బాబా వద్దకు వెళ్ళగానే బాబా అతనితో, “నేను నిన్ను నేలకు వెన్ను ఆనించవద్దని చెప్పాను కదా!” అని అన్నారు.
బాబా మహల్సాపతి కుటుంబ బాగోగులను కూడా నిరంతరం గమనిస్తూ ఉండేవారు. ఒకసారి మహల్సాపతి భార్య దూరాన ఉన్న తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడుండగా ఆమెకు గొంతుభాగంలో ఒక కణితి లేచి, విపరీతంగా బాధపెట్టసాగింది. సర్వజ్ఞులైన బాబా ఆ విషయం తెలుసుకొని మహల్సాపతితో, “నీ భార్యకు గొంతు దగ్గర ఒక కణితి లేచింది. దాన్ని నేనే నయం చేస్తాను. ఇంకెవ్వరూ నయం చేయలేరు!” అని అన్నారు. తన భార్య ఆరోగ్యం గురించి ఏమీ తెలియని మహల్సాపతికి బాబా మాటలలోని మర్మం అర్థం కాకపోయినప్పటికీ ఏదో సాదాసీదాగా “అవును బాబా” అని అన్నాడు. తరువాత కొన్నిరోజులకి మహల్సాపతికి తన భార్య వద్ద నుండి ‘తనకు ఒక కణితి లేచిందని, తరువాత చిత్రంగా అదే తగ్గిపోయింద’ని లేఖ వచ్చింది. అది చదివాక బాబా మాటలలోని ఆంతర్యం మహల్సాపతికి బోధపడింది.
బాబా తరచూ తమ భక్తుల రోగాలను తాము స్వీకరించి వాళ్ళకు ఉపశమనం కలిగించేవారు. ఇందుకు సంబంధించి మహల్సాపతి కుమారుడైన మార్తాండ్ మహల్సాపతి ఒక అందమైన అనుభవాన్ని ఇలా చెప్పారు: “ఒకసారి మా అమ్మ నందూర్ షింగోట్ అనే గ్రామంలో ఉన్న తన సోదరుని వద్దకు వెళ్ళింది. ఒకరోజు మా నాన్నగారు తన అలవాటు ప్రకారం బాబా వద్ద కూర్చొని ఉండగా అకస్మాత్తుగా బాబా, “అరే భగత్, నా భక్తులొకరు ఒక కురుపుతో చాలా బాధపడుతున్నారు. చూడు! నా తుంటిపై కూడా ఒక కురుపు ఉంది. కానీ, ఇప్పుడది నయమవుతుంది” అని అన్నారు. నిజంగానే బాబా తుంటిపై ఒక కురుపు ఉండటాన్ని, దానివలన ఆయన బాధపడుతుండటాన్ని నాన్న చూశారు. దాంతో నాన్న ఆందోళన చెందసాగారు. అది గమనించిన బాబా మా నాన్నతో, “చింతించకు! రెండు మూడు రోజుల్లో ఇది తగ్గిపోతుంది” అని అన్నారు. నిజానికి బాబా మాటలు అత్యంత నిగూఢమైనవి. ఆ మాటలు తనకు సంబంధించినవేనని మా నాన్న ఆ సమయంలో గ్రహించలేదు. రెండు, మూడు రోజుల తరువాత బాబా తుంటిపై ఉన్న కురుపు చిట్లింది. మరో రెండు మూడు రోజుల తరువాత నాన్నకి నందూర్ షింగోట్లో ఉన్న అమ్మ వద్ద నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో, ‘తన తుంటిపై ఒక కురుపు లేచి చాలా బాధపడ్డాననీ, ఫలానా రోజున ఆ నొప్పి నుండి ఉపశమనం కలిగిందనీ, మరో రెండు మూడు రోజులకి కురుపు చిట్లింద’నీ అమ్మ తెలియజేసింది. ఆ లేఖ చదివాక, సరిగ్గా బాబా తన తుంటిపై కురుపు ఉందని చెప్పిన సమయం నుండి అమ్మకి బాధ తగ్గిందనీ, అక్కడ ఆమెకి కురుపు చిట్లినరోజే ఇక్కడ శిరిడీలో బాబా తుంటిపై కురుపు చిట్లడం జరిగిందనీ మేము గ్రహించాము. దాంతో నాన్న తన భార్య బాధను బాబా స్వీకరించారని చాలా బాధపడి నాతో, “అరే మార్తాండ్, చూశావా? నీ తల్లికి ఉపశమనం కలిగించడానికి ఆమె బాధను బాబా తమ మీదకు తీసుకున్నారు. మన వల్ల ఆయన చాలా బాధపడాల్సి వచ్చింది” అని అన్నారు.
1908 తరువాత ఒకసారి బాబా, “ఖండోబాకి సంబంధించినవాళ్ళకి త్వరలో కష్టాలున్నాయి. అయినా వారు భయపడాల్సిన అవసరం లేదు. నేను అవసరమైనది చేస్తాను” అని అన్నారు. కొద్దిరోజులకి మహల్సాపతి భార్య, అతని కుమార్తె తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. మరికొద్ది రోజులకే కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. బాబా దర్శనానికి వచ్చే భక్తులలో ఉన్న కొంతమంది వైద్యులు ఆ విషయం తెలుసుకొని మహల్సాపతికి కొన్ని మందులిచ్చారు. ఆ మందుల విషయమై మహల్సాపతి బాబాను సంప్రదిస్తే, ఆయన ఆ మందులు వాడవద్దని చెప్పి, “మంచానపడ్డవారిని మంచంలోనే ఉండనీ” అని, మసీదు చుట్టూ తిరుగుతూ తమ చేతిలోని సటకాను ఊపుతూ, “రా! నీ శక్తి ఎంతటిదో మేమూ చూస్తాం! నా ముందుకొచ్చావంటే, నా చేతిలో ఉన్న ఈ చిన్నకర్రతో నేనేమి చేయగలనో నీకు చూపిస్తాను” అంటూ ఏదో అదృశ్యశక్తిని బెదిరించసాగారు. అది మహల్సాపతి కుటుంబసభ్యుల వ్యాధికి బాబా చేసిన చికిత్స. ఫలితంగా, ఎటువంటి ఔషధమూ లేకుండా మహల్సాపతి కుటుంబసభ్యులందరూ కోలుకున్నారు. వ్యాధితో పోరాడేవారికి బాబా అనుసరించిన పద్ధతి ఆధునిక ఔషధం కాకపోయినప్పటికీ అది ఖచ్చితంగా ప్రభావవంతమైనదని నిరూపణ అయింది.
మహల్సాపతికి నలుగురు కుమార్తెలు – జానకీబాయి, సీతాబాయి, రఖుమాబాయి మరియు విఠాబాయి. వాళ్ళకి అస్నాగాఁవ్, దోచాలే, డోర్హాలే, రూయీ గ్రామాలకు చెందిన అబ్బాయిలతో వివాహాలయ్యాయి. పేదవాడైనందున మహల్సాపతి పట్ల అతని వియ్యంకులకు ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. ఒకసారి డోర్హాలేలో ఉన్న అతని వియ్యంకుడొకడు తన ఇంట్లో ఏదో కార్యం జరుపుకుంటూ భోజనానికి రమ్మని మహల్సాపతికి ఆహ్వానం పంపాడు. అక్కడికి వెళ్లేముందు అతను బాబా అనుమతి కోసం మసీదుకు వెళ్ళాడు. బాబా అతనితో, “నీకు అక్కడ అవమానం జరగనుంది” అని అన్నారు. దానికి మహల్సాపతి “పోకపోతే ఎలా బాబా? పిలిచిన వాళ్ళు దగ్గర బంధువులు. పోలపోతే ఏమయినా అనుకుంటారు. అక్కడ అందరూ భోజనానికి నాకోసం ఎదురు చూస్తుంటారు. పోక తప్పదు!” అని అన్నాడు. బాబా మౌనం వహించారు. మహల్సాపతి బాబా వద్ద సెలవు తీసుకొని ఒక స్నేహితుని వెంటబెట్టుకొని డోర్హాలే వెళ్ళాడు. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి తన రాక గురించి ఏ మాత్రమూ పట్టించుకోకుండా అందరూ భోజనాలు చేసి, చేతులు కడుక్కుంటూ ఉండటం మహల్సాపతికి కనిపించింది. జరిగిన అవమానానికి మహల్సాపతి భోజనం చేయకుండానే తిరిగొచ్చి, జరిగినదంతా బాబాతో చెప్పుకున్నాడు.
మరోసారి, శిరిడీ నుండి ఆరు నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న అస్తీగాఁవ్కు చెందిన రాంభావ్ హార్డే అనే సాయిభక్తుడు తమ గ్రామానికి వచ్చి పురాణ పఠనం చేసి, విందారగించి వెళ్ళమని మహల్సాపతిని ఆహ్వానించాడు. అసలే మహల్సాపతికి పురాణ పఠనమందు ఎంతో ఆసక్తి, పైగా చక్కటి ఆహ్వానం. అందుచేత మహల్సాపతి ఎంతో సంతోషంగా ఆ ఆహ్వానాన్ని మన్నించి, సెలవు తీసుకోవడానికి బాబా దగ్గరకి వెళ్ళాడు. బాబా అతనితో, “వెళ్లొద్దు. అక్కడ గొడవ జరుగుతుంది” అని అన్నారు. అయినప్పటికీ అతను తనకొచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించలేక ఆ గ్రామానికి వెళ్లి పురాణ పఠనం చేయసాగాడు. అంతలో భోజనానికి కూర్చున్న కొంతమంది సభ్యత, సంస్కారం లేని ఆకతాయి కుర్రాళ్ళకు మిగతా కుర్రాళ్లతో మాటామాటా పెరిగి కర్రలతో కొట్లాటకు దిగారు. దాంతో పురాణ పఠనం వినడానికి కూర్చున్నవాళ్లంతా భయంతో పారిపోయారు. మహల్సాపతి కూడా తన పఠనాన్ని ఆపి, వాళ్ళని అనుసరించాడు. తిరిగి శిరిడీ చేరుకున్నాక మహల్సాపతి బాబా దగ్గరికి వెళ్లి, “బాబా! మీ మాటలే నిజమయ్యాయి” అని అన్నాడు. ఈ విధంగా మహల్సాపతి జీవితంలో జరగబోయే ఎన్నో సంఘటనల గురించి బాబా ముందే చెప్పేవారు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు, ”మనం ఎంచుకున్న రూపంలో భగవంతుడు మనలను గమ్యం చేరుస్తాడు” అని చెప్పాడు. ఖండోబా, విఠలుడు, అల్లా మొదలైన దేవతలందరూ ఒకటే. ఏ దేవతారాధన అయినా ఒకటిగానే బాబా పరిగణించేవారు. మహల్సాపతికి ఖండోబాపై దృఢమైన విశ్వాసం. అతనికి ఖండోబా కృప చాలాసార్లు వ్యక్తమైంది. అతనికి కష్టాలు వచ్చినప్పుడల్లా ఖండోబా అతనికి దర్శనమిచ్చేవారు. ఒకసారి మహల్సాపతి కష్టాలలో ఉన్నప్పుడు ఖండోబా అతనికి దర్శనమిచ్చి, “పండరీపురం వెళ్లి విఠలుని దర్శనం చేసుకో” అని ఆదేశించారు. తనతో పాటు తన కుటుంబీకుల కడుపు నింపుకోవడం కోసం భిక్షపై ఆధారపడే మహల్సాపతి వంటి పేదవానికి పండరియాత్ర చేయడమంటే ఆషామాషీ కాదు. కానీ, ఖండోబా దయవల్ల అతనికి ధనసహాయంతో పాటు, స్థితిమంతులైన ఒక కుటుంబ సాహచర్యం లభించింది. వాళ్లతో కలిసి మహల్సాపతి పండరిపురం చేరుకున్నాడు. పండరీపురంలో ఎప్పుడూ జనసందోహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ జనాన్ని దాటుకొని విఠలుని దర్శనం చేసుకోవడం అంత తేలిక కాదు. అందువలన అత్యాశాపరులైన కొంతమంది పూజారులు భక్తుల వద్ద ధనం గుంజి విఠలుని దర్శనం చేయిస్తుండేవారు. కానీ పేదవాడైన మహల్సాపతి వద్ద ధనం లేనందున జనంలో అలాగే తోసుకుంటూ మెల్లగా ముందుకు వెళ్ళసాగాడు. విఠలుని సమీపిస్తుండగా అకస్మాత్తుగా అతని ముఖం అందరికీ ఖండోబాలా కనిపించసాగింది. దాంతో, ‘సాక్షాత్తూ ఖండోబానే విఠలుని దర్శనానికి వచ్చారా!’ అని అందరూ అతనికి దారి ఇచ్చారు. అక్కడున్న పూజారులకు కూడా అదే అనుభూతి కలిగి వెంటనే మహల్సాపతికి విఠలుని దర్శనం చేయించారు.
అదేవిధంగా జజూరీ యాత్రలో మహల్సాపతికి, అతని బృందానికి సహాయం అందిన కొన్ని సందర్భాలున్నాయి. శిరిడీ నుండి 150 మైళ్ళ దూరంలో ఉన్న పూణే జిల్లాలోని జజూరీ ఖండోబా దేవత యొక్క మూలస్థానం. ఖండోబా ఉపాసకుడు, ఖండోబా ఆలయంలో పూజారి అయిన మహల్సాపతి సాంప్రదాయానుసారం ప్రతి యేడూ మాఘశుద్ధపౌర్ణమికి శిరిడీ నుండి జజూరీకి వెళ్ళి, అక్కడ జరిగే ఉత్సవాలలో పాల్గొనేవాడు. అతను తమ కులాచారం ప్రకారం పల్లకీని తీసుకొని, మరికొందరు ఖండోబా భక్తుల బృందంతో డప్పు మొదలైన వాయిద్యాలు వాయించుకుంటూ ఊరేగింపుగా అంతదూరమూ కాలినడకనే వెళ్ళేవాడు. శిరిడీ నుండి బయలుదేరినప్పటినుండి ఉపవాస దీక్షలో ఉండి, కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా యాత్ర చేసేవాడు. తిరుగు ప్రయాణంలో ‘కరా’ అనే నదిలో స్నానం చేసి, ఉపవాసదీక్ష విరమించి, పారణ చేసేవాడు. ఇలా ప్రతి యేడూ నియమంగా చేసేవాడు మహల్సాపతి.
ఒకసారి మహల్సాపతి జజూరీ యాత్రకు బృందంగా బయలుదేరాడు. అప్పట్లో కొన్ని భద్రతాకారణాల దృష్ట్యా అనుమతి పత్రాలు (pass) లేకుండా ఊరేగింపుగా స్వస్థలం వదలి వెళ్ళకూడదనే ప్రభుత్వ నిషేధం ఉంది. మహల్సాపతి బృందం పారనేరు అనే గ్రామం చేరేసరికి రాత్రయింది. బాజాభజంత్రీలతో సాగుతున్న ఆ బృందాన్ని పోలీసులు ఆపి, వారి పాసులు తనిఖీ చేశారు. ఆ బృందంలో ఒకరికి పాసు లేకపోవడంతో అతణ్ణి అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్ళారు. దాంతో మహల్సాపతి బృందం అక్కడే ఆగిపోయింది. మరుసటిరోజు ఉదయాన్నే మహల్సాపతి పోలీసు అధికారిని కలిసి విషయం వివరించాడు. ఆ గ్రామాధికారి (కులకర్ణి) నుండి రిమాండులో ఉన్న వ్యక్తి పేర పాసు తీసుకొస్తే అతణ్ణి వదిలేస్తామన్నాడా పోలీసు అధికారి. మహల్సాపతి ఆ గ్రామ కులకర్ణిని కలిసి, పాసు వ్రాసి ఇప్పించవలసిందని ప్రార్థించాడు. ఆ కులకర్ణికి తనతో పనిబడినవారితో ఏదో ఒక పని చేయించుకొనిగానీ సహాయం చేసే అలవాటు లేదు. అందువల్ల, “అలానే పాసు వ్రాయించి ఇస్తాను, ఈ లోపల ఆ కట్టెలు కొంచెం కొట్టిపెట్టు” అని మహల్సాపతికి పురమాయించాడు. మహల్సాపతికి తప్పింది కాదు. గొడ్డలి తీసుకొని రెండు దెబ్బలు వేసేసరికి గొడ్డలికున్న పిడికట్టె విరిగిపోయింది. కులకర్ణి మరో గొడ్డలి ఇచ్చాడు. అదీ విరిగింది. అలాగే మూడో పిడికట్టె కూడా విరగడంతో కులకర్ణి ఆశ్చర్యపోయాడు. మహల్సాపతి పూర్వాపరాలు క్షుణ్ణంగా విచారించి, “మీచేత కట్టెలు కొట్టించడం ఆ భగవంతుడికి ఇష్టంలేదు” అంటూ, పాసు వ్రాసి ఇచ్చి, కొన్ని బొప్పాయిపండ్లు కూడా దేవునికి నైవేద్యం పెట్టమని ఇచ్చి పంపాడు.
అలాగే ఒక సంవత్సరం మహల్సాపతి, అతని బృందం జజూరీ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నారు. వాళ్లతోపాటు ‘మాలం భగత్’ అనే మరో పల్లకీ బృందం కూడా ఉంది. దారిలో ఓ చోట ముఖాలకు మందపాటి వస్త్రంతో ముసుగులు వేసుకున్న దొంగలముఠా గొడ్డళ్లతో వాళ్లను అటకాయించారు. వాళ్ళు తమను గాయపరుస్తారనే భయంతో మహల్సాపతి అక్షింతలు, చందనం చేతుల్లోకి తీసుకుని వాళ్ళపైకి విసిరి, తనవారితో కలిసి ప్రక్కనే ఉన్న చెట్ల చాటున దాక్కున్నాడు. కొంతసేపటి తరువాత దొంగలముఠా వెళ్ళిపోవడంతో మహల్సాపతి, అతని బృందం పల్లకీని మోసుకుంటూ వడివడిగా ముందుకు సాగిపోయారు. కొంతదూరం వెళ్ళాక చూస్తే, తమ పల్లకీలో ఉండాల్సిన విగ్రహాలేవీ కనిపించలేదు. అప్పుడు బృందంలోని ఒక వ్యక్తి, “మనమిప్పుడు ఈ ఖాళీ పల్లకీని శిరిడీ తీసుకెళ్తామా?” అని అన్నాడు. ఆరోజు ఆదివారం, ఖండోబాకు ప్రీతికరమైన రోజు. అందువలన మహల్సాపతి, “ఆదివారంనాడు యాత్ర ఉండదు” అని అన్నాడు. అయితే, అతని మాటకు బృందంలోని మిగతా సభ్యులు ఒప్పుకోలేదు. అప్పుడు మహల్సాపతి, “ఆదివారంనాడు యాత్ర చేయడం మంచిది కాదు” అని అన్నాడు. అంతలో అకస్మాత్తుగా మహల్సాపతిని ఖండోబా ఆవహించి, “అరే, ఇది ఏ రోజు? ఇది నా రోజు కాదా? మీరు ఎందుకు పల్లకీని తీసుకువెళుతున్నారు? ఈరోజు నేను కొండపై వేటలో నిమగ్నమై ఉన్నాను. వేట పూర్తయిన తర్వాత నేను శిరిడీకి వస్తాను. మీరు ఇక వెళ్లడం మంచిది” అని అన్నాడు. వెంటనే మహల్సాపతి మామూలు స్థితికి వచ్చాడు. అందరూ పల్లకీ తీసుకుని తమ ప్రయాణాన్ని సాగించి శిరిడీలోని ఖండోబా మందిరం వద్దకు చేరుకున్నారు. సఖారాం కందుకర్ మొదలైన గ్రామస్థులు ఖండోబా దర్శనం కోసం పల్లకీ వద్దకు వచ్చారు. బృందంలోని సభ్యులు పల్లకీలో విగ్రహాలు లేవని వాళ్లతో చెప్పారు. సఖారాం పల్లకీలో చూస్తే, పల్లకీలో ఉండాల్సిన అన్ని విగ్రహాలూ ఉన్నాయి. దాంతో అతను, “విగ్రహాలు లేవంటారేమిటి? విగ్రహాలన్నీ ఉన్నాయి కదా!” అంటూ వాటిని చూపించాడు. పల్లకీలో విగ్రహాలను చూసి మహల్సాపతితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విధంగా మహల్సాపతికి బాబా అనుగ్రహం వలన ఎప్పటికప్పుడు దివ్యానుభవాలు కలుగుతుండేవి.
ఒకసారి అతను భక్తబృందంతో ఖండోబా యాత్రకు వెళ్ళినప్పుడు దారిలో బాగా దాహమై ఒక బావి వద్ద ఆగారు. ఆ ప్రాంతంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని తెలుసుకున్న మహల్సాపతి భక్తితో బాబాను స్మరించుకున్నాడు. వెంటనే ఆ బావి వద్ద చిన్న నీటి ప్రవాహం ప్రత్యక్షమైంది. మహల్సాపతికి, తోటి ప్రయాణీకుల అవసరాలకు ఆ నీరు సరిపోయింది. మరోసారి మహల్సాపతి ఖండోబాను పల్లకీలో తీసుకొని జజూరీ యాత్రకు బృందంగా బయలుదేరాడు. వాళ్ళు జజూరీ సమీపిస్తుండగా ఆ ప్రాంతమంతటా ప్లేగు మహమ్మారి ప్రబలంగా వ్యాపించి ఉందని తెలిసింది. దాంతో తోటి భక్తులందరూ భయపడిపోయారు. మహల్సాపతి కూడా నిరాశచెంది ఏమి చేయాలో అర్థంకాక నిస్సహాయంగా పల్లకీనానుకొని కూర్చున్నాడు. అంతలో తన వెనుక ఎవరో ఉన్నట్లనిపించి అటువైపు చూశాడు. అక్కడ అతనికి బాబా కనిపించి అంతలోనే అదృశ్యమయ్యారు. బాబా దర్శనం అతనికి ఎంతో ధైర్యాన్నిచ్చింది. వెంటనే తనకు కలిగిన అనుభవం గురించి తోటి భక్తులతో చెప్పి, “బాబా మనతో ఉన్నారు. మనం ఆందోళన చెందనవసరం లేదు” అని అన్నాడు. అది విని అందరూ ఆనందభరితులై ఎంతో ఉత్సాహంగా బాబాను, ఖండోబాను కీర్తిస్తూ జజూరీ చేరుకున్నారు. అక్కడున్న నాలుగురోజుల్లో వాళ్ళకు ఏ చిన్న కష్టమూ కలుగలేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనా జరగకుండా వారి యాత్ర విజయవంతంగా పూర్తయింది. శిరిడీకి తిరిగి వచ్చిన తరువాత మహల్సాపతి మసీదుకు వెళ్ళగానే బాబా అతనిని చూస్తూ, “అరే భగత్, యాత్ర బాగా జరిగింది కదా! నేను అక్కడికి వచ్చినప్పుడు నువ్వు పల్లకీనానుకొని కూర్చుని కనిపించావు” అని అన్నారు. దాంతో, తన కళ్ళు తనను మోసం చేయలేదనీ, బాబా అంతటా ఉంటూ తమ భక్తులను సంరక్షిస్తున్నారనీ అనుకున్నాడు మహల్సాపతి. ఏదేమైనా, అతని ప్రతి కదలికపై ఉన్న బాబా దృష్టి వారి యొక్క గొప్ప అద్భుతశక్తిని, భక్తులపై తమకున్న అద్భుతమైన ప్రేమను, సంరక్షణను తెలియజేస్తాయి. ఈవిధంగా భక్తుడైన మహల్సాపతి బాధ్యత తమదని బాబా అనేక సందర్భాలలో నిరూపిస్తూ వచ్చారు.
బాబా దృష్టి తమ భక్తుల ప్రాపంచిక ప్రయోజనాలపైన మాత్రమే కాకుండా వారి నైతిక ప్రవర్తనపై ఎంతగానో ఉండేది. ఆయన తరచూ, “ఏ ఋణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. కుక్క, పంది, ఈగ మొదలైనవి ఏవైనా అంతే. కనుక, ‘ఛీ, ఛీ, పో, పొమ్మ’ని ఎవరినీ తరిమివేయకండి. ఎవరైనా మీ వద్దకు వస్తే అలక్ష్యం చేయక ఆదరించండి” అని చెప్పేవారు. అయితే, బాబా ఎన్నడూ అనవసరమైన ఉపన్యాసాలు ఇచ్చేవారు కాదు. ప్రత్యేకమైన లీలల ద్వారా తాము బోధించినవాటిని భక్తులతో ఆచరింపజేసేవారు. ఎంతటి భక్తునికైనా ఏమారే క్షణాలుంటాయి గాబోలు! సహజంగా మహల్సాపతి ధర్మబద్ధమైన వ్యక్తి అయినప్పటికీ కొన్నిసార్లు తప్పటడుగు వేసేవాడు. అతను రోజూ రాత్రిపూట ఒక కుంటికుక్కకు అన్నం పెడుతుండేవాడు. అది తిని వెంటనే వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అతడెంత అదిలించినా అది అక్కడినుండి కదలలేదు. దాంతో మహల్సాపతి ఒక కర్ర తీసుకొని దాన్ని కొట్టాడు. అది నొప్పితో అరుస్తూ పారిపోయింది. తరువాత మహల్సాపతి మసీదుకెళ్లి, బాబా పాదాలొత్తుతుండగా అక్కడున్న బాపూసాహెబ్ జోగ్, దాదాకేల్కర్ మొదలైన భక్తులతో బాబా, “అరే, ఈ గ్రామంలో నాలాంటి రోగిష్టి కుక్క ఉంది. అందరూ దాన్ని కొట్టేవారే!” అని అన్నారు. బాబా మాటలు వింటూనే మహల్సాపతి కొంతసేపటి క్రితం తన ప్రవర్తనను గుర్తుచేసుకొని పశ్చాత్తాపపడ్డాడు. కానీ అటువంటి పరిస్థితి అతనికి మరోసారి వచ్చింది. ఒకసారి మహల్సాపతి తండ్రి సంవత్సరీకంనాడు అతిథులొచ్చి భోజనానికి కూర్చున్నారు. అకస్మాత్తుగా ఒక గజ్జికుక్క వచ్చి వాళ్ళ ముందు నిలబడింది. మహల్సాపతి ఆ కుక్కకొక రొట్టెముక్క వేయమని తన భార్యతో చెప్పాడు. కానీ ఏ కారణం చేతనో ఆమె రొట్టెముక్క వేయలేదు. కొంతసేపటి తరువాత ఆ కుక్క ఇంకా అక్కడే ఉండటం చూసిన మహల్సాపతి దాన్ని కొట్టి తరిమేశాడు. ఆ రాత్రి అతను బాబా కోసం పడక సిద్ధం చేస్తుండగా మునపటిలాగే బాబా అతనితో, “గ్రామంలో జబ్బుతో బాధపడుతున్న నాలాంటి రోగిష్టి కుక్క ఉంది. ఎందుకురా భగత్, ప్రజలు దాన్ని కొడుతున్నారు?” అని అన్నారు.
ఇంకోసారి, నోట చొంగ కారుతున్న రోగగ్రస్తమైన కుక్క ఒకటి తోకాడించుకుంటూ మహల్సాపతి దగ్గరకు వచ్చింది. అతను దాన్ని చీదరించుకొని రాయి విసిరి తరిమికొట్టాడు. అది బాధతో అరుస్తూ పారిపోయింది. తరువాత అతను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అతనిని చూపిస్తూ ఇతర భక్తులతో, “నేను ఎంతో ఆశతో కొద్దిపాటి ఆహారం కోసం ఈ భగత్ వద్దకు వెళ్ళాను. కానీ నాకు లభించింది దెబ్బలు మాత్రమే” అని అన్నారు. ఈ సంఘటన ఉదయం జరిగింది. రెండు గంటల తరువాత దీక్షిత్ వాడాలో భక్తులు భోజనాలు చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక కుక్క వచ్చి వాడా మెట్లమీద కూర్చుంది. దీక్షిత్ దాన్ని తరిమేస్తే అది పరిగెత్తుకుంటూ వెళ్లి కాస్త దూరంలో మరోచోటనున్న మెట్ల మీద కూర్చుంది. అక్కడ ఎవరో దాన్ని రాయితో కొట్టారు. అది బాధతో అరుస్తూ భయపడుతూ పారిపోయింది. దాని అరుపులు విన్న భక్తులు ఆరోజు ఉదయం బాబా అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. దీక్షిత్ మనసు నొచ్చుకోగా బాధతో, “నేను ఆ కుక్కను తరిమికొట్టకుండా ఒక రొట్టెముక్క ఇచ్చివుంటే, అది ఇలా గాయపడకుండా వెళ్లిపోయేది కదా” అని అనుకున్నాడు. అదేరోజు సాయంత్రం దాసగణు తన కీర్తనలో నామదేవునికి సంబంధించిన ఒక కథను ఆలపించాడు. దాని సారం: ‘ఒకసారి నామదేవుడు విఠలుని విగ్రహం వద్ద నివేదించిన పళ్లెంలోని రొట్టెముక్కను ఒక కుక్క తన నోటిలో కరుచుకొని పరుగుతీసింది. అది చూసిన నామదేవుడు, “దేవా! ఎండురొట్టె తినకండి. ఇదిగో, ఈ నెయ్యితో తినండి” అంటూ ఒక గిన్నెతో నెయ్యి పట్టుకొని ఆ కుక్కకు అందించడానికి దాని వెనుక పరుగుతీశాడు’ అని. అదేరోజు రాత్రి మారుతి మందిరంలో మాధవరావు అడ్కర్ ‘భక్తలీలామృతం’ అనే గ్రంథాన్ని పఠించాడు. అతను చదివిన భాగంలో పైన చెప్పిన నామదేవుని కథే వచ్చింది. ఆ విధంగా బాబా ఆరోజు ఉదయం తాము బోధించిన విషయానికి బలాన్ని చేకూర్చారు. బాబా అనుసరించిన పద్ధతికి అందరూ ఆశ్చర్యపోయారు.
అహంకార మమకారాలను జయించడంలో సాధకులు పెద్ద విషయాలలో జాగ్రత్త వహిస్తూ, చిన్న చిన్న విషయాలలో తప్పటడుగు వేయటం సామాన్యంగా జరుగుతుంటుంది. కానీ, ఘటనాఘటన సమర్థుడైన సద్గురువు తనదైన అద్భుతరీతిలో తన భక్తుని మనస్సు అడుగుపొరల్లో దాగిన ఆశామమకారాలను వెలికితీసి, గుర్తింపజేస్తాడు. ఒకసారి ఖండోబా ఆలయంలో దొంగతనం జరిగింది. మహల్సాపతి వాడుకొనే ఉన్ని జంఖానా, కొన్ని పాత్రలు దొంగిలించబడ్డాయి. ఆ కంబళి అంటే మహల్సాపతికి చాలా ప్రీతి. ఆ వస్తువుల కోసం వెతికి, ఇక వాటిమీద ఆశ వదులుకున్నారు. కొన్నిరోజుల తర్వాత డోర్హాలాలో ఉన్న మహల్సాపతి కూతురు (గ్రామస్థులు బట్టలు ఉతుక్కునే బండ దగ్గరకు) బట్టలు ఉతుక్కునేందుకు వెళ్ళినప్పుడు, ఒక మహిళ ఉతికేందుకు తెచ్చిన కంబళిని చూచి, అది తన తండ్రిదని గుర్తించి, గ్రామపటేలుకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళను ప్రశ్నిస్తే, ఆమెకు ఆ కంబళి ఇచ్చిన దొంగ కూడా దొరికాడు. పటేలు ఆ కంబళిని గుర్తించి తీసుకొని పొమ్మని మహల్సాపతికి కబురుపెట్టాడు. మహల్సాపతి ఆ కంబళి తెచ్చుకోవడానికి బాబా అనుమతి కోరితే, “ఏం లాభం? నీవు వెళ్ళినా ఒకటే, వెళ్ళకున్నా ఒకటే” అన్నారు బాబా. అయినా బాబా మాటలు లెక్కచేయక డోర్హాళ్ వెళ్ళాడు మహల్సాపతి. కంబళి దొరికింది. కానీ తన వియ్యపురాలు ఆ కంబళిని తనకివ్వమని కోరడంతో, దాన్ని ఆమెకు ఇవ్వక తప్పిందికాదు. బాబా మాటల్లోని అంతరార్థం, జరిగినదాన్లోని పరమార్థం అప్పుడు అతనికి స్ఫురించింది. ఆ దొంగ తనకు పరోక్షంగా మేలే చేశాడని గుర్తించి, ఆ దొంగపై ఫిర్యాదు ఉపసంహరించుకొని, ఆ దొంగను క్షమించి వదలివెయ్యమని పటేలును అభ్యర్థించి, వట్టి చేతులతో, వట్టిపోయిన మనస్సుతో, నిర్వికారంగా శిరిడీ చేరాడు మహల్సాపతి. ఆ విధంగా మహల్సాపతి జీవితంలో జరగబోయే అనేక సంఘటనలను గురించి బాబా ముందే చెప్పేవారు.
బాబా మాట్లాడే మాటలు నర్మగర్భంగానూ, ఎంతో నిగూఢంగానూ ఉండేవి. పలు సందర్భాల్లో వారు మాట్లాడే ఆ మాటలను భక్తులు అర్థం చేసుకోలేకపోయేవారు. అందువల్ల వాళ్లలో చాలామంది మహల్సాపతిని ఆశ్రయించి, బాబా మాటలకు అర్థమేమిటో చెప్పమని అడిగేవారు. ఎందుకంటే, బాబాతో నిరంతర సహవాసం వలన బాబా బాహ్యంగా వ్యక్తపరిచే వింత ప్రవర్తనను, విచిత్ర చర్యల యొక్క అంతరార్థాన్ని మహల్సాపతి అర్థం చేసుకోగలిగేవాడు; బాబా సంజ్ఞలకు, నిగూఢమైన వారి మాటలకు అర్థాన్ని వివరించగలిగేవాడు. బాబా కూడా విద్యావంతులైన అనేకమంది భక్తులను మహల్సాపతి వద్దకు పంపేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇలా వ్రాశాడు: “మహల్సాపతి ఆధ్యాత్మికతపై పట్టు సాధించాడు. ప్రాపంచిక విషయాలపట్ల ఎలాంటి కోరికలు లేకుండా ఉండేవాడు. అతని ద్వారా సాయిభక్తులు జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందేవారు. బాబా మహాసమాధి అనంతరం ఎంతోమంది సాయిభక్తులకు అతను ఓదార్పునిచ్చే వ్యక్తి అయ్యాడు”.
బాబా మహాసమాధి చెందడానికి పది పన్నెండు రోజుల ముందు, భక్తులు బాబా పడకను సిద్ధం చేస్తున్న సమయంలో, బాబా తాము పరుండే సమయంలో తమ తలక్రింద పెట్టుకొనే ఇటుక మాధవ్పస్లే చేతినుండి జారి క్రిందపడి రెండు ముక్కలైపోయింది. మహల్సాపతి ఆ ఇటుక ముక్కలను ఎప్పటిలానే గుడ్డలో చుట్టి బాబా తలదిండుగా ఉంచాడు. బాబా అది గమనించి ఆ ఇటుక ముక్కలను చేతిలోకి తీసుకుని, “దీన్ని ఎవరు విరగ్గొట్టారు?” అని అడిగారు. మహల్సాపతి మాధవ్‌ఫస్లే పేరు చెప్పగా బాబా అతనిపై కోప్పడ్డారు. కానీ మరుక్షణమే శాంతించి, ఆ ఇటుక ముక్కలను తమ చెక్కిలికి ఆనించుకుని, “నా జీవిత సహచరి విరిగిపోయింది” అంటూ కన్నీరు కార్చారు. మరుసటిరోజు ఉదయానికి కూడా బాబా దిగులుగానే ఉన్నారు. బాబా దిగులుగా ఉండటం గమనించిన కాకాసాహెబ్ దీక్షిత్, “బాబా! ఇటుక విరిగినందుకు విచారించనవసరంలేదు. ఆ రెండు ఇటుక ముక్కలను వెండితో జతచేయించి ఇస్తాను” అని చెప్పాడు. బాబా చిన్న నవ్వు నవ్వి, “నువ్వు వీటిని బంగారంతో జతపరిచినా ఉపయోగం ఏమిటి? ఈ ఇటుక నా జీవిత సహచరి. ఇది విరిగిపోవడం అశుభాన్ని సూచిస్తుంది!” అని అన్నారు. అప్పటినుండి బాబా విచారంగా ఉంటున్నట్లు మహల్సాపతికి అనిపించింది. కానీ రానున్న తమ అవసాన ఘడియల గురించి బాబా సూచిస్తున్నారని అతను తెలుసుకోలేకపోయాడు. ఈ సంఘటన జరగడానికి ముందొకసారి కూడా బాబా మహల్సాపతికి అటువంటి సూచననే ఇచ్చారు. ఒకరోజు సాయంకాలం మహల్సాపతి దీపం వెలిగించి, చిలిం నింపబోతుండగా బాబా అతనితో, “అరే భగత్, కొద్దిరోజుల్లో నేను ఎక్కడికో వెళ్తాను. ఆ తరువాత 2 లేదా 4 సంవత్సరాలపాటు రాత్రిళ్ళు నువ్వు ఇక్కడికి(మసీదుకి) వస్తావు” అని అన్నారు. ఆ మాటలు మహల్సాపతికి అర్థం కాలేదు.
1918, అక్టోబరు 15వ తేదీన బాబా మహాసమాధి చెందారు. అప్పటివరకు ఆయనతో తనకున్న అనుబంధం కారణంగా బాబా వియోగాన్ని భరించలేని మహల్సాపతి అన్నపానాలను త్యజించి 13 రోజులపాటు పస్తున్నాడు. బాబా అప్పుడప్పుడు తమ మరణం గురించి నిగూఢంగా చేసిన సూచనలన్నీ అతనికి అప్పుడు క్రమంగా అర్థమవసాగాయి. సాయి సన్నిధిలో అతనలవరచుకున్న భక్తీ, వివేకమూ తిరిగి శక్తి పుంజుకున్నాయి. మహాసమాధి వలన బాబా ఉనికికేమీ భంగం లేదన్న విశ్వాసం బలపడింది. మునుపటిలాగే అతను రాత్రిళ్ళు మసీదులో గడుపుతుండేవాడు. ఆ సమయంలో అతను మౌనంగా ధ్యానస్థుడయ్యేవాడు. ఒక్కోసారి మసీదులో కూర్చుని కన్నీరు కారుస్తూ, బాబా భౌతికంగా ఉన్నప్పుడు ఎలాగైతే బాబా కాళ్ళు పట్టేవాడో, అలాగే బాబా అక్కడ ఉన్నట్లు ‘కాళ్ళొత్తుతూ‘ రాత్రిళ్ళంతా గడిపేవాడట. అలాంటి స్థితిలో మహల్సాపతిని చూచిన భక్తులకు ఆ దృశ్యం ఎంతో హృదయవిదారకంగా తోచేదట. అలా నాలుగేళ్ళు గడిచాయి.
1922, సెప్టెంబరు 11, భాద్రపద శుద్ధ ఏకాదశి, ఖండోబాకు పవిత్రమైన సోమవారంనాడు మహల్సాపతి ఎప్పటిలానే ఖండోబాకు, బాబాకు పూజ పూర్తిచేసుకొని, “నేడు నా తండ్రి ఆబ్దికానికి వంట త్వరగా చేయండి. నేడే నేను నా ప్రాపంచిక జీవనాన్ని ముగించి స్వర్గానికి వెళ్తాను” అని అన్నాడు. పురోహితుడు లక్ష్మణ్ వచ్చి శ్రాద్ధకర్మలు యథావిధిగా పూర్తిచేశాడు. అతిథుల భోజనం ముగిశాక మహల్సాపతి, అతని కుటుంబం భోజనానికి కూర్చున్నారు. మహల్సాపతి భోజనం చేసి తాంబూలం వేసుకున్నాడు. తరువాత అతను కఫ్నీ ధరించి సమీపంలో ఉన్న బాలాగురవ్, రామచంద్రకోతే మొదలైనవారితో, “రామ నామస్మరణ చేయమ”ని చెప్పాడు. నామస్మరణ జరుగుతుండగా తన కుమారుడు మార్తాండ్‌కు తన దండాన్నిచ్చి, “ఉత్తమమైన భక్తిమార్గంలో సమయాన్ని గడుపుతూ జీవించు. నేను నీకు చెప్పినవన్నీ జరుగుతాయి” అని చెప్పాడు. ఇదిలా ఉండగా, కొందరు భక్తులు మహల్సాపతి నిర్యాణం చెందనున్న విషయాన్ని తెలియపరుస్తూ, వెంటనే ముంబాయి నుండి బయలుదేరి శిరిడీ రమ్మని కాకాసాహెబ్ దీక్షిత్‌కు టెలిగ్రామ్ ద్వారా కబురు పంపారు. అంతేకాదు, ఆ విషయం తెలిసిన శిరిడీ, పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి మహల్సాపతిని చివరిసారి కలిశారు. మరుసటిరోజు వేకువఝామున మహల్సాపతి ‘రామా!’ అని ఉచ్ఛరిస్తూ తుదిశ్వాస విడిచాడు. అలా ఆ ధన్యజీవి తన 85వ ఏట 1922, సెప్టెంబరు 12, ఏకాదశి ఘడియల్లో సాయి పాదాలలో ఐక్యమయ్యాడు. మహల్సాపతి పార్థివదేహానికి లెండీబాగ్ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించదగ్గవి: బాబా తమ అంత్యకాలంలో మహల్సాపతితో, “అరే భగత్, కొద్దిరోజుల్లో నేను ఎక్కడికో వెళ్తాను. ఆ తరువాత 2 లేదా 4 సంవత్సరాలపాటు రాత్రిళ్ళు నువ్వు ఇక్కడికి వస్తావు” అని చెప్పినట్లే, 1918లో బాబా మహాసమాధి చెందిన తరువాత సరిగ్గా నాలుగు సంవత్సరాలే (1922 వరకు) మహల్సాపతి మసీదుకి వెళ్ళాడు. అంతేకాదు, పాతికేళ్ళ క్రిందట మార్తాండ్ జన్మించినప్పుడు బాబా మహల్సాపతితో, “ఈ బిడ్డని 25 ఏళ్ళపాటు చూసుకో” అని అన్నారు. బాబా చెప్పినట్లే మార్తాండ్కి 25 ఏళ్ళ వయస్సు వచ్చాక మహల్సాపతి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈవిధంగా మహల్సాపతి మరణం గురించి బాబా ముందే సూచనలిచ్చారు. ఏదేమైనా తన మరణానికి తానే ముహూర్తం నిర్ణయించుకొని, భగవన్నామస్మరణ చేస్తూ, ప్రశాంతంగా దేహత్యాగం చేయగలగడం మహాయోగులకుగానీ సాధ్యంకాదు. యోగనాథుడైన బాబా శిక్షణలో మహల్సాపతి అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలు అధిరోహించాడనే విషయం ఆయన నిర్యాణం చెందిన విధానమే చెబుతున్నది.
ద్వారకామాయి నుండి కొద్దిదూరంలో ఉన్న మహల్సాపతి ఇంటిలో అతని సమాధిని, బాబా ధరించిన కఫ్నీ, చెప్పులు, చేతికర్ర(సటకా) మొదలైన వస్తువులను నేటికీ భక్తులు సందర్శించుకుంటున్నారు.
సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ,
శ్రీసాయిబాబా బై శ్రీసాయిశరణానంద,
లైఫ్ ఆఫ్ శ్రీసాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి,
సాయిలీల మ్యాగజైన్ జూలై-ఆగస్టు 2005 సంచిక.